Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో విస్తరణకు వ్యతిరేకంగా హైకోర్టులో పిల్
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో విస్తరణకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ఏపీడబ్ల్యూఎఫ్ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హైదరాబాద్ మెట్రో ఎండీ, వక్ఫ్ బోర్డు సీఈవోలను ప్రతివాదులుగా చేర్చారు. పాతబస్తీలో మెట్రో నిర్మాణంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చారిత్రక కట్టడాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణం చేపడుతున్నారని పేర్కొంటూ.. పాతబస్తీలో మెట్రో నిర్మాణంపై ఏపీడబ్ల్యూఎఫ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
తెలంగాణ వారసత్వ చట్టం 2017 ప్రకారం.. చారిత్రక కట్టడాలను రక్షించాలని పేర్కొంది. పాతబస్తీ ప్రతిపాదిత మెట్రోమార్గం సమీపంలో చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్, పురానా హవేలి, మొఘల్ పురా సమాధులు వంటి చారిత్రక కట్టడాలు ఉన్నాయని వివరించింది.

మెట్రో రైలు నిర్మాణం కారణంగా ఈ స్మారక చిహ్నాలకు నష్టం జరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం తదుపరి పనులు చేపట్టే ముందు హైకోర్టు లేదా నిపుణుల బృందం ఆమోదం పొందాలని కోరింది. అప్పటివరకు పనులను నిలిపివేయాలని ఏపీడబ్ల్యూఎఫ్ హైకోర్టును విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 17న హైకోర్టు ఈ విషయంపై తదుపరి విచారణకు ఆదేశిస్తూ వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications