మోదీ ఆశీర్వాదంతో వేగంగా తెలంగాణ అభివృద్ధి సాధ్యం: సీఎం రేవంత్ రెడ్డి
దేశాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం భాగస్వామ్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాని మోదీ సహకరించాలని కోరారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదని, ఇది అభివృద్ధి ఉత్సవమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆశీర్వాదం ఉంటే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని హెచ్‌ఐసీసీలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానితో పాటు రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
"ఇది అభివృద్ధి ఉత్సవం. కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం కాదు. జాతీయ భద్రత, జాతీయ అభివృద్ధే మనకు అత్యధిక ప్రాధాన్యం. ముందు భారత దేశం, తర్వాత ప్రజలు, ఆ తర్వాతే పార్టీ అనేది స్పష్టం. ఆ స్ఫూర్తితోనే దేశ నిర్మాణానికి ప్రధానమంత్రి మోదీ వికసిత్ భారత్ 2047ను ప్రకటించినప్పుడు, మేము భాగస్వాములయ్యాం. తెలంగాణ రైజింగ్ కు మీరు పూర్తి సహకారం అందిస్తారనే విశ్వాసం మాకు ఉంది. తెలంగాణను దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్, రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించేందుకు మోదీ వచ్చారు" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
" ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. మోదీ ఎన్నికలు పూర్తయ్యాక అభివృద్ధి పనులకు వచ్చారు. మనం అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ప్రధాని మోదీ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సహకారంతో గుజరాత్ మోడల్‌ను అభివృద్ధి చేశారు. తెలంగాణ ప్రజలు కూడా రాబోయే పదేళ్లలో మీ సహకారంతో మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. నాటి మన్మోహన్ సింగ్ విధంగా, ఆయన స్ఫూర్తితో మీరు నాకు పూర్తి సహకారం అందిస్తారని విశ్వసిస్తున్నా" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
2034లో 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటామనే నమ్మకం ఉంది. 2047 వరకు 3 ట్రిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటామని ఆశిస్తున్నా. నాడు మన్మోహన్‌సింగ్ ఆశీస్సులు అందించినట్లే మీరు తెలంగాణ ప్రజలకు ఆశీస్సులు అందించాలి. భారీ ఆర్థిక వృద్ధి, మహా నగరాలు, విశ్వ నగరాల నుంచే వస్తుంది. మనకు దిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్ ఆరు మహా నగరాలున్నాయి. ఈ దేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలంటే, యువతకు ఉద్యోగాలు రావాలంటే ఈ మహా నగరాలను అభివృద్ధి చేయాలి.. అని అన్నారు.
ఈ ఆరు మెట్రో నగరాలకు సంబంధించిన జాతీయ ప్రాధాన్యత గల అన్ని ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు త్వరగా లభించేలా ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రత్యేక సింగిల్ విండో టాస్క్ ఫోర్స్ ఉండాలి. మోదీ.. నా రాష్ట్రం, నా ప్రజల కోసం సానుకూల నిర్ణయాల విషయంలో నేను మిమ్మల్ని, కేంద్ర మంత్రులను అనేకసార్లు కలిశాను. మా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులకు మీ అత్యవసర అనుమతులు, ఆమోదాలు అవసరం. మూసీ నది, మెట్రో రైలు, రేడియల్ రోడ్లు, హైదరాబాద్-మచిలీపట్నం వరకు 12 వరుసల రహదారికి సంబంధించి రెండు గంటల పాటు మీరు సమయం కేటాయించి సమీక్షించాలి.. అని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ మిత్రులు.. మీకు పెద్ద మనస్సు ఉందని చెబుతున్నారు.. మోదీ మీకు పెద్ద మనస్సు ఉందని తెలంగాణ తెలుసు. నేడు వారు దాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ పనులు, ప్రతిపాదనలు అన్నింటినీ ఈరోజు మీరు ఆమోదిస్తారని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు. దేశం విషయంలో మేం మీతో కలిసి ఉన్నాం. మీరు వికసిత్ భారత్ 2047పైన మాట్లాడి, భారతదేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే అంశంపై మాట్లాడినప్పుడు, మేం మా రాష్ట్ర కోణంలో 'తెలంగాణ రైజింగ్ 2047'ను దానికి అనుసంధానం చేశాం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications