KTR: కేటీఆర్ బామ్మర్ది ఇంట్లో పోలీసుల సోదాలు..!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజ్ పాకాల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ కేసులో పోలీసులు కార్తీక్ అనే వ్యక్తిని ఏ1గా.. పాకాల రాజ్ ను ఏ2గా చేర్చారు. మరింత సమాచారం కోసం పోలీసులు రాయదుర్గం లోని ఓరియన్ విల్లాస్‌లోని నెంబర్ 40 విల్లాలో నివాసం ఉంటున్న రాజ్ పాకాల ఇంట్లో సోదాలు చేస్తున్నారు. అక్కడి చేరుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ దాడులు నిర్వహిస్తోంది. మరోవైపు జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఎక్సైజ్ పోలీసులు మరోసారి తనిఖీలు చేశారు.
బామ్మర్ది ఈ కేసులో అడ్డంగా బుక్ కావడంతో కేటీఆర్ ఇరకాటంలో పడ్డారు. రాజ్ పాకాల విషయమై కేటీఆర్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. డ్రగ్స్ కల్చర్ కు తాను పూర్తిగా వ్యతిరేకమంటూ గతంలో కేటీఆర్ కల్లబొల్లి మాటలు చెప్పారని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.జన్వాడ ఫామ్‌హౌస్ లో జరిగిన రేవ్ పార్టీపై కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ సొంత బావమరది రాజ్ పాకాల డ్రగ్స్ వ్యాపారంలో ఉన్నారని ఆరోపించారు.

రాజ్ పాకాల చాలా మందికి డ్రగ్స్ అలవాటు చేశారని అన్నారు. పోలీసులు ఈ కేసులో సమగ్ర విచారణను చేపట్టాలన్నారు. తెలంగాణను డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని కాంగ్రెస్ మహిళా నాయకురాల శోభ అన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీలో 35 మంది పట్టుబడ్డారని చెప్పారు. రేవ్ పార్టీలో మీరున్నారో లేదో బహిర్గతం చేయాలన్నారు. కేటీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రక్త పరీక్ష చేసుకోవాలన్నారు. ప్రతి చిన్న విషయానికి ట్వీట్ చేసే కేటీఆర్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
డ్రగ్ పార్టీలకు మూలం కేటీఆర్ ఫాంహౌసేనని ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు విడుదల చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాడ్ చేశారు. శని, ఆదివారాలు వచ్చాయంటే రేవ్ పార్టీలని, రావుల పార్టీలని విచ్చలవిడిగా డ్రగ్స్ దందా జరుగుతుందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల బీఆర్ఎస్ పై మాటల యుద్ధం చేస్తుంటే.. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇప్పటి వరకు స్పందించడం లేదు. కేటీఆర్ మాజీ మంత్రి మల్లారెడ్డి మనవరాలి పెళ్లికి వెళ్లినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications