రాజ్ పాకాల, శైలేంద్ర ఇళ్లలో సోదాలు: డీజీపీకి కేసీఆర్ ఫోన్
జన్వాడ ఫాంహౌస్ పార్టీ వ్యవహారం, ఆ తర్వాత రాజ్ పాకాల, శైలేంద్ర పాకాల ఇళ్లలో సోదాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. రాజ్ పాకాల, శైలేంద్ర పాకాల ఇళ్లల్లో సోదాలు నిర్వహించడంపై డీజీపీ జితేందర్‌కి కేసీఆర్ ఫోన్ చేశారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఎందుకు తనిఖీలు చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే సోదాలు ఆపాలని డీజీపీని కోరారు కేసీఆర్.
కాగా, శనివారం రాత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన జన్వాడలోని 30 ఎకరాల్లో ఉన్న ఫాంహౌస్‌పై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. భారీ శబ్ధాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 35 మందితో నిర్వాహకులు మద్యం పార్టీ నిర్వహించినట్లు తెలిసింది. ఇక్కడ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధరించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. విదేశీ మద్యం సహా భారీగా లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు, కేటీఆర్ బావమరిది ఫాంహౌస్ పార్టీపై లోతుగా దర్యాప్తు జరిపించాలని సైబరాబాద్ పోలీసులకు కాంగ్రెస్ మహిళా నేతలు ఫిర్యాదు చేశారు. ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్ కు వచ్చిన ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్, టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత పోలీసు ఉన్నతాధికారులను కలిశారు. రాజ్ పాకాల ఫాంహౌస్‌లో జరిగిన పార్టీపై లోతైన దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసు విచారణ చేస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీలత తెలిపారు. ఏ1గా ఫాంహౌస్ సూపర్ వైజర్ కార్తిక్, ఏ2గా రాజ్ పాకాలను చేర్చామని ఆమె చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి పార్టీ నిర్వహించారని తెలిపారు.
కర్ణాటక లిక్కర్ తోపాటు విదేశీ మద్యం కూడా స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. ఏడు లీటర్ల విదేశీ మద్యాన్ని సీజ్ చేశామని వివరించారు. ఫామ్ హౌస్ యజమాని, మాజీ మంత్రి కేటీఆర్ బంధువు రాజ్ పాకాల ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సీఐ శ్రీలత తెలిపారు. ఈ కేసు విచారణలో మరికొన్ని విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందన్నారు.












Click it and Unblock the Notifications