బెంగుళూరులో ఇద్దరు అరెస్ట్?: తుది దశకు నయీం కేసు విచారణ
హైదరాబాద్: తెలంగాణ పోలీసుల చేతిలో ఎన్ కౌంటర్‌లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీం కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కేసులో నల్లగొండ జిల్లాకు చెందిన ఓ రాజకీయ నేతతో పాటు ఓ పోలీసు ఉన్నతాధికారిని సిట్ అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
వీరిద్దరిని సిట్ బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే వీరి అరెస్టులపై సిట్ మాత్రం అధికారికంగా ధ్రువీకరించలేదు. మరోవైపు నయీం కేసును విచారిస్తున్న సిట్ ఈ కేసుతో సంబంధమున్న అధికార పార్టీకి చెందిన టీఆర్‌ఎస్ నేతలకు ఉన్న లెసైన్సుడ్ ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది.
ఇప్పటికే ఈ కేసులో పలువురు నాయకులకు నోటీసులు జారీ చేశారు. మరికొందరి నేతల ఆయుధ లెసైన్సులు కూడా రద్దు చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. నయీంతో ఆర్ధిక లావాదేవీలు జరిపిన పోలీసు ఉన్నతాధికారుల్లో ఎనిమిది మంది పోలీసులకు మెమోలు ఇచ్చినట్లు సమాచారం.

ఇందులో భాగంగా తమ సర్వీసు రివాల్వర్లను సరెండర్ చేయాలని ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఓ రిటైర్డ్ అధికారి నయీంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు సిట్ అధికారులు ఆధారాలను సేకరించారు.
మూడు, నాలుగు రోజుల్లో సిట్‌కు చట్ట బద్దత కల్పిస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేయనుంది. ప్రస్తుతం సిట్ డీజీపీ ఆధ్వర్యంలో వేసిన ఓ ఉన్నత స్థాయి ప్రత్యేక బృందం. నయీం కేసులో పలువురు రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారుల ఆర్ధిక లావాదేవీల ద్వారా లబ్ధిపొందారనే అభియోగం ఉన్న నేపథ్యంలో సిట్‌కు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టాలంటూ డీజీపీ తెలంగాణ సీఎస్‌కు లేఖ రాశారు.
ఈ లేఖపై తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. ఇదే గనుక జరిగితే నయీంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులకు నోటీసులు అందజేసి సిట్ కార్యాలయంలో ప్రత్యేకంగా ప్రశ్నించే అవకాశం సిట్‌కు రానుంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే సిట్ తన పనిని మొదలు పెట్టనుంది.












Click it and Unblock the Notifications