Pomegranate: భారీగా తగ్గిన దానిమ్మ పండ్ల ధర, కారణం ఇదే
హైదరాబాద్: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే దానిమ్మపండ్ల ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున ఈ పండ్లు సరఫరా కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రెండు వారాల క్రితం వరకు ఒక్కో దానిమ్మపండుకు 30 రూపాయలు ఉండగా.. ఇప్పుడు సగానికి తగ్గి రూ. 15కు పడిపోయింది.
హైదరాబాద్ నగరానికి దానిమ్మపండ్లు ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సరఫరా అవుతాయి. తెలంగాణలో కూడా ఈ పంట బాగానే పండుతంది. మహారాష్ట్రలోని జల్నా, సంగ్లి, షోలాపూర్, ఔరంగాబాద్, పుణె, అహ్మద్‌నగర్, వాషి ప్రాంతాల్లో ఈ దానిమ్మపంట ఎక్కువగా పండుతోంది.

ఇక కర్ణాటకలోని కోలార్, చిక్కబల్లాపూర్, బెంగళూరు రూరల్, బెలగావి, బగల్‌కోట్ ప్రాంతాల్లో దానిమ్మ పంట ఎక్కువగా పండిస్తారు. ఈ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరంలోని బాటసింగారం మార్కెట్లోకి పెద్ద ఎత్తున దానిమ్మపండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ధరలు దాదాపు సగానికి తగ్గిపోయాయి.
ఈ ఏడాది పంట బాగా పండటంతో సరఫరా ఎక్కువగా ఉందని.. ఈ క్రమంలోనే దానిమ్మ పండ్ల ధరలు తగ్గాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం కూడా లేకపోలేదని చెప్పారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పండ్లను కొనేందుకు ప్రజల నుంచి కూడా ఎక్కువగా డిమాండ్ ఉంటుందని తెలిపారు.

హోల్ సేల్ మార్కెట్లలో బాక్సుల్లో పెట్టి దానిమ్మ పండ్లను విక్రయిస్తున్నారు. ఈ బాక్సుల్లో ఒక్కో దాంట్లో 50 నుంచి 100 దానిమ్మ పండ్ల వరకు ఉంటాయి. ఈ బాక్సులను కొనుగోలు చేసిన స్థానిక వ్యాపారులు వినియోగదారులకు రిటైల్‌గా విక్రయిస్తుంటారు.
సాధారణంగా దానిమ్మపండ్ల సరఫరా జులై, ఆగస్టు నెలల్లో ఎక్కువగా ఉంటుందని మార్కెట్లోని వ్యాపారులు చెబుతున్నారు. మరో రెండు నెలలపాటు ఈ సరఫరా ఇలాగే కొనసాగుతుందని అంటున్నారు. ఈ మధ్య కాలంలోనే దానిమ్మపండ్ల ధరలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని.. ఆ తర్వాత తిరిగి ధరలు పెరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలుదారులు కూడా ఎక్కువ మొత్తంలో దానిమ్మ పండ్లను కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications