ధరణిలో 23 వేల ఎకరాల అక్రమాలు.. భూభారతి ఆషామాషీగా తీసుకురాలేదు: మంత్రి పొంగులేటి
తెలంగాణ శాసనసభ సాక్షిగా రాష్ట్రంలో నెలకున్న భూ సమస్యలు, 22ఏ నిబంధనలు , ధరణి అక్రమాలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధరణి పోర్టల్ ను అడ్డుపెట్టుకుని గత పాలకులు లక్షలాది ఎకరాలను చెరబట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా వారి బండారం బయటపడుతుండటంతోనే సభ నుంచి తప్పించుకొని తిరుగుతున్నారని విమర్శించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను స్వప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో కేసీఆర్ కుటుంబం, వాళ్ల బంధువులు మాత్రమే బాగుపడ్డారని అన్నారు. అలాగే ధరణి తప్పిదాలతో వందల మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.
తెలంగాణలోని దాదాపు 2.49 కోట్ల ఎకరాల భూమిని తమ సొంత ఆస్తిగా భావించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగించిందని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. ధరణి పోర్టల్ నిర్వహణను దివాలా తీసిన ఒక విదేశీ కంపెనీకి అప్పగించారని దుయ్యబట్టారు. ధరణి పోర్టల్ పై ఉన్న నియంత్రణను దుర్వినియోగం చేస్తూ అర్ధరాత్రి సమయాల్లో రిజిస్ట్రేషన్లు చేశారని కీలక ఆరోపణలు చేశారు. ప్రజల ఆస్తులను పరిరక్షించడమే రెవెన్యూ సంస్కరణల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. శాసనసభలో 22ఏ నిషేధిత భూముల అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.

తమ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం ఆశామాషీగా తీసుకురాలేదని.. దాదాపు 18 రాష్ట్రాల్లోని అధికారులు అధ్యయనం చేశాక..ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాతే భూ భారతికి రూపకల్పన చేశామని స్పష్టం చేశారు. భూభారతి ఎన్ ఐసి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనే పారదర్శకంగా నడుస్తుందని తెలిపారు. అలాగే 22ఏ నిషేధిత భూముల అంశంపై మాట్లాడుతూ.. 2023 నాటికి 22 ఏ జాబితాలో కోటి 2 లక్షల 52 వేల 690 ఎకరాలకు సంబంధించిన వివరాలను సభ ముందు ఉంచారు మంత్రి పొంగులేటి. వీటిలో అటవీ, అసైన్డ్, ఇతర ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.












Click it and Unblock the Notifications
