ప్రణయ్ హత్య కేసులో కీలక మలుపు: అమృత తండ్రి ఒప్పందం, చంపింది అతనే?
హైదరాబాద్/మిర్యాలగూడ: మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో పోలీసులు కాంగ్రెస్ నేత కరీంను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కరీంను పోలీసులు ప్రశ్నిస్తున్నారని సమాచారం. హత్య కేసులో పోలీసులు పలు కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు.
అమృతపై ప్రేమతోనే చంపించా, 9వ తరగతిలోనే చెప్పా: ప్రణయ్ హత్యపై అమ్మాయి తండ్రి

మహ్మద్ బారి అనే రౌడీ షీటర్‌తో ఒప్పందం
ప్రణయ్ హత్య కేసులో పోలీసులు తమ అనుమానాలను అన్ని కోణాల్లో నివృత్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రణయ్ హత్యకు మహ్మద్ బారి అనే రౌడీ షీటర్‌తో అమృత తండ్రి మారుతిరావు డీల్ కుదుర్చుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో మహ్మద్ బారి... మారుతిరావును కిడ్నాప్ చేశాడు.

అప్పటి నుంచి పరిచయం
కిడ్నాప్ చేసినప్పటి నుంచి మహ్మద్ బారి, మారితి రావుల మధ్య పరిచయం ఏర్పడింది. మహ్మద్ బారి పాతబస్తీకి చెందిన షఫీని రంగంలోకి దింపి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రణయ్‌ను హత్య చేసింది షఫీ అని పోలీసులు భావిస్తున్నారు.

కాగా
అమృత తన తండ్రి, బాబాయ్‌ల పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తన తండ్రి సైకోలాగా, మతపిచ్చితో ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహించారు. తాము ఏడేళ్లుగా ప్రేమించికుంటున్నామని, తొమ్మిదో తరగతి నుంచి తన తండ్రి వద్దని చెబుతున్నారని, కానీ తాము ప్రేమించుకుంటున్నామని చెప్పారు. తాను తన తండ్రిని క్షమించేది లేదని, చంపేస్తానని అన్నారు. తాను కులరహిత సమాజం నిర్మించేందుకు ప్రయత్నిస్తానని, ప్రణయ్ విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తానని చెప్పారు.

పరువు హత్య అనవద్దని
మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యను పరువు హత్య అన్న గౌరవప్రదమైన పేరు పెట్టడం ఎందుకని, అది అతి కిరాతకంగా జరిగిన ఓ దారుణ హత్య అనీ కొందరు విద్యావేత్తలు అంటున్నారు. పరువు హత్య అని అనడం దళితులపై జరుగుతున్న అరాచకాల పట్ల ఏమాత్రం సానుభూతి, సామాజిక స్పందన లేదన్న విషయాన్ని సూచిస్తుందని, ప్రణయ్‌ను చంపినది కుల దురంహకారమని దళిత కార్యకర్తలు డాక్టర్ పసునూరి రవీందర్ తదితరులు అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!