బెంగాల్లో దీదీని నిండా ముంచిన SIR-ఇన్ని సీట్లలో షాకింగ్ లెక్కలు..!
పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. దీని వెనుక చాలా కారణాలు ఉన్నా మమత ముందు నుంచీ భయపడిన ఓటర్ల జాబితాల సవరణే అతిపెద్ద కారణంగా నిలుస్తోంది. చాలా నియోజకవర్గాల్లో తొలగించిన ఐదు వేల నుంచి పాతిక వేల ఓట్లే మమతా బెనర్జీకి వరుసగా నాలుగోసారి అధికారం రాకుండా అడ్డుపడినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
బెంగాల్ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం.. ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ చేపట్టింది. దీనిపై మమత సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడినా ఫలితం లేకపోయింది. భారీ ఎత్తున ఈసీ నియోజకవర్గాల్లో ఓట్లను తొలగించింది. లక్షలాది ఓట్ల తొలగింపుపై అభ్యంతరాలు వ్యక్తమైనా ఫలితాల తర్వాత కూడా చూసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు లైట్ తీసుకుంది. దీంతో మరణించిన, నకిలీ ఓటర్ల తొలగింపు లక్ష్యంతో జరిగిన ఈ ప్రక్రియలో రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు జాబితా నుండి తొలగించారు. ఇదే ఇప్పుడు మమత కొంప ముంచింది.

అయితే SIR ప్రక్రియ పక్షపాతంగా ఉందని, తమ ఓటు బ్యాంకును కోల్పోతామని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ప్రస్తుతం తృణమూల్ అధికారం కోల్పోయిన నేపథ్యంలో, ఈ ఓటర్ల తొలగింపులు బీజేపీ, తృణమూల్‌ల ఓట్లపై ఎంత ప్రభావం చూపాయో అర్థమవుతోంది. NDTV సమీక్ష ప్రకారం, బెంగాల్‌లోని 147 నియోజకవర్గాల్లో 25వేలకు పైగా ఓటర్ల పేర్లు తొలగించగా, బీజేపీ వాటిలో గణనీయంగా లబ్ధి పొందింది. ఈ 147 స్థానాల్లో బీజేపీ 95 గెలుచుకోగా, తృణమూల్ 51, కాంగ్రెస్ కేవలం ఒక స్థానానికే పరిమితమయ్యాయి. ఓటర్ల తొలగింపులు 15వేల నుంచి 25వేల మధ్య ఉన్న 67 నియోజకవర్గాల్లోనూ బీజేపీయే విజేతగా నిలిచింది. వీటిలో బీజేపీ 47 స్థానాలు సాధించగా, తృణమూల్ 19 స్థానాలను, కాంగ్రెస్ ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. ఈ గణాంకాలు SIR వల్ల బీజేపీకి లబ్ధి చేకూరిందని స్పష్టం చేస్తున్నాయి.

అలాగే 5వేల నుంచి 15వేల వరకు పేర్ల తొలగింపులు జరిగిన 62 నియోజకవర్గాల్లో బీజేపీ ఏకంగా 50 స్థానాలను కైవసం చేసుకుంది. మిగిలిన 12 స్థానాలను తృణమూల్ దక్కించుకుంది. అంతేకాకుండా ఈ తొలగింపులు 5వేల కంటే తక్కువగా ఉన్న 13 స్థానాలను కూడా బీజేపీనే గెలుచుకోవడం విశేషం. ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియలో 'తొలగించడానికి అర్హమైనవి'గా గుర్తించిన అత్యధిక ఓటర్ల కేసులు ముర్షిదాబాద్ జిల్లా నుండే నమోదయ్యాయి. ఇక్కడ 4.55 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు తొలగించారు. తర్వాతి స్థానాల్లో ఉత్తర 24 పరగణాలు (3,25,666), మాల్దా (2,39,375) జిల్లాలు ఉన్నాయి. ముర్షిదాబాద్‌లో 2021లో తృణమూల్ 22 స్థానాల్లో 20 గెలుచుకోగా, ఈసారి అది కేవలం తొమ్మిదికి పడిపోయింది. ఇది మైనారిటీ ఓట్ల చీలికను, బీజేపీకి అనుకూలంగా హిందూ ఓట్ల ఏకీకరణను స్పష్టంగా సూచిస్తుంది. ఇక్కడ ఓటర్ల తొలగింపు ప్రభావం గణనీయంగా ఉంది. ఉత్తర 24 పరగణాల్లోనూ ఇదే పరిస్దితి. ఈ జిల్లాలోని 33 స్థానాల్లో 2021లో తృణమూల్ 28 గెలుచుకోగా, ఈసారి ఎనిమిది స్థానాలకు పడిపోయింది. మాల్దాలోని 12 స్థానాల్లో, తృణమూల్ వాటా 2021లో ఎనిమిది నుండి ఇప్పుడు ఆరుకు తగ్గింది. మిగిలినవి బీజేపీవే.












Click it and Unblock the Notifications