ప్రాజెక్ట్ టైగర్: దేశంలో పెరిగిన పులుల గాండ్రింపు; తాజా లెక్కలివే!!
ప్రాజెక్టు టైగర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో తాజాగా పులుల గణాంకాలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ గణాంకాలు పులుల సంఖ్య విషయంలో కాస్త సానుకూల ఫలితాలను ఇచ్చాయి. 2022 నాటికి భారతదేశంలో 3,167 పులులు ఉన్నాయని భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.
ఈ సంఖ్య 2018లో 2,967 ఉండగా, 2014లో 2,226, 2010లో 1706, 2006లో 1,411 పులులు ఉన్నట్టు గణంకాలు వెల్లడించాయి. ఇక ఈ పులుల సంతతిని లెక్కించడం కోసం దేశాన్ని వివిధ ప్రాంతాలుగా విభజించి ఒక్క ప్రాంతంలోని పులుల సంతతిని గుర్తించడం కోసం అటవీ అధికారులు ఏర్పాటు చేశారు. పులిజాతి కనుమరుగైపోకుండా, వాటిని రక్షించడానికి ప్రాజెక్టు టైగర్ ని ప్రారంభించి అప్పటినుండి పులుల సంరక్షణ పై ప్రధానంగా దృష్టి సారించారు.

గంగా నది మైదానాలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, మధ్య భారతదేశం, బ్రహ్మపుత్ర వరద మైదానాలుగా వివిధ ప్రాంతాలను విభజించి 2018లో పులుల గణనను పూర్తి చేశారు. దీనిలో భాగంగా 3,81,400 చదరపు కిలోమీటర్లు సర్వే చేశామని, మొత్తం 141చోట్ల 26,838 కెమెరాలను ఉపయోగించామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఒక పక్క కేంద్రం దేశవ్యాప్తంగా పులుల సంఖ్య పెరుగుతున్నట్లు ప్రకటించినా, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పులుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతున్నట్టుగా వెల్లడించింది.
టైగర్ రిజర్వుల నిర్వహణలో రాష్ట్రానికి చెందిన అమ్రాబాద్ 78.79% స్కోర్ తో పులుల సంరక్షణలో వెరీగుడ్ కేటగిరీలో నిలిచిందని, ఇక పులుల సంరక్షణకు పేరుగాంచిన కవ్వాల్ అటవీ ప్రాంతం 74.24% స్కోర్ తో గుడ్ కేటగిరీలో నిలిచిందని కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో 26కు పైగా పులులు ఉన్నట్టు 2018 సర్వేలో తేలింది. అమ్రాబాద్ లో 16, కవ్వాల్ లో 10 పులులు ఉన్నట్టు అప్పుడు అంచనా వేశారు.

ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల జనాభా తగ్గుముఖం పడుతున్న తరుణంలో భారతదేశంలో మాత్రం పెరుగుతున్న ట్రెండ్ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ప్రాజెక్టు టైగర్ విజయం కేవలం భారతదేశానికి మాత్రమే కాదు యావత్తు ప్రపంచానికి చెందిన విజయమని చెప్పొచ్చు. భారతదేశం పులులను రక్షించడమే కాకుండా అభివృద్ధి చెందడానికి సురక్షితమైన నివాసాన్ని కూడా అందించి ప్రాజెక్టు టైగర్ ను సక్సెస్ చేసింది.












Click it and Unblock the Notifications