హైదరాబాద్ కేంద్రంగా వ్యభిచార దందా.. నిన్న బ్యూటీ పార్లర్, నేడు లాడ్జీలో పట్టుబడ్డ గ్యాంగ్!!
హైదరాబాద్ కేంద్రంగా వ్యభిచార దందా గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. హైదరాబాద్ లో ఉన్న బ్యూటీ పార్లర్ లు, హోటళ్ళు, లాడ్జిలు కేంద్రంగా హైటెక్ వ్యభిచారం జరుగుతుంది. నిత్యం హైదరాబాదులో ఎక్కడో ఒకచోట వ్యభిచార ముఠాలు పట్టుబడటం ఈ దందా ఎంతగా సాగుతుందో తెలియజేస్తుంది.

బ్యూటీ పార్లర్లు.. లాడ్జీలు కేంద్రాలుగా వ్యభిచార దందా
నిన్నటికి నిన్న సిగ్నేచర్ బ్యూటీ పార్లర్ లో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి అక్కడ జరుగుతున్న వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. సిగ్నేచర్ బ్యూటీ పార్లర్ నిర్వాహకులు పారిపోవడంతో, అక్కడ ఉన్న విటుడిని అరెస్టు చేసి వారి కోసం గాలింపు చేపట్టారు. ఇక తాజాగా ఎల్బినగర్ కామినేని హాస్పిటల్ ఎదురుగా ఉన్న కర్నాటి రామారావు అనే వ్యక్తి నిర్వహిస్తున్న వెంకటేశ్వర లాడ్జిలో పోలీసులు దాడులు చేశారు. లాడ్జిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో దాడులు చేసిన పోలీసులు ఈ దాడులలో ఆరుగురిని అరెస్టు చేశారు.

ఎల్బీనగర్ వెంకటేశ్వర లాడ్జిలో వ్యభిచారం .. ఆరుగురు అరెస్ట్
ఎల్బినగర్ కామినేని హాస్పిటల్ ఎదురుగా ఉన్న వెంకటేశ్వర లాడ్జ్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్న ఎడ్డ సహదేవ్ అనే వ్యక్తి సెక్స్ వర్కర్లను నియమించుకొని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కర్నూలు జిల్లాకు చెందిన మహిళలను, నల్గొండ జిల్లాకు చెందిన మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీంతో విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేసిన ఎల్బీనగర్ పోలీసులు వీటిల్లో దేవరాజు, మాణిక్ స్వరూప్ లతోపాటు, ఇద్దరు మహిళలను, లాడ్జి నిర్వాహకులు కర్నాటి రామారావు, సహదేవ్ లను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

హైదరాబాద్ కేంద్రంగా రెచ్చిపోతున్న వ్యభిచార ముఠాలు
హైదరాబాద్ నగరంలో నగరం నడిబొడ్డున ఇటువంటి దందాలు సాగుతున్నా, పోలీసులు కట్టడి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఇప్పటివరకు పట్టుబడిన చాలా కేసులలో విశ్వసనీయ సమాచారం మేరకే ఈ దాడులు నిర్వహించారు. ఇక సమాచారం రాని, గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న అనేక వ్యభిచార కేంద్రాలు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. వాటి పైన కూడా పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న హైటెక్ వ్యభిచారానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ పై ఉంది.












Click it and Unblock the Notifications