సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి: ఈసీకి రఘునందన్ రావు ఫిర్యాదు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మరికాసేపట్లో పోలింగ్ ముగియనుంది. రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు. కాగా, వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈసీకి ఫిర్యాదు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈసీ నిబంధనలను ఉల్లంఘించారని, తక్షణమే సీఎంపై చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కొడంగల్‌లో ఓటు వేసిన అనంతరం సీఎం రేవంత్ ప్రెస్‌మీట్ పెట్టడంపై రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసిన తర్వాత రాజకీయపరమైన అంశాలపై సీఎం ప్రెస్‌మీట్ పెట్టారంటూ ధ్వజమెత్తారు.

ప్రెస్‌మీట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు రఘునందన్ రావు. ఓటమి భయంతోనే నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం చేశారని విమర్శించారు. తక్షణమే ఎన్నికల సంఘం స్పందించి సీఎం రేవంత్ రెడ్డిని గృహ నిర్భందంలో ఉంచాలని డిమాండ్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు . అయితే, అనంతరం ప్రెస్‌మీట్ నిర్వహించి.. పలు అంశాలను ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ తెలిపారు. రైతు రుణమాఫీ ఏమీ అసాధ్యమైన టాస్క్ కాదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు తమ 100 రోజుల పాలనకు రెఫరెండమన్నారు. పై వ్యాఖ్యలు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని రఘునందన్ రావు పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డిపై తక్షణనమే ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications