ఈడీ కేసులపై స్పందించిన కవిత
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార జోరు పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి. ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది.
భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత నేడు నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తోన్నారు. రోడ్ షోలను నిర్వహిస్తోన్నారు. బహిరంగ సభలను ఏర్పాటు చేస్తోన్నారు. జనంలో మమేకం అవుతున్నారు. ఇంటింటినీ పలకరిస్తోన్నారామె.

గతంలో నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహించిన అనుభవం ఉండటం కవితకు కలిసొచ్చింది. జిల్లా వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టారామె. తన ఎన్నికల ప్రసంగాల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలపై ఘాటు విమర్శలు చేస్తోన్నారు. రెండు పార్టీలపై పలు ఆరోపణలు సంధిస్తోన్నారు.
తాజాగా నిజామాబాద్ జిల్లా నవీపేట్‌లో నిర్వహించిన రోడ్ షోలో రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. తెలంగాణకు గెస్ట్ లాంటోడని అభివర్ణించారు. ఇక్కడికి వచ్చి బిర్యానీ తిని, పాన్ వేసుకుని వెళ్లిపోతుండటాడంటూ ఎద్దేవా చేశారు. గాంధీ కుటుంబం తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహాన్ని ఎవ్వరూ విస్మరించబోరని అన్నారు.
కాంగ్రెస్ చరిత్ర చూస్తే- తెలంగాణకు ఎప్పుడూ ద్రోహం చేస్తూనే వచ్చిందని కవిత మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిందలు వేయడానికే కాంగ్రెస్ నాయకులు తెలంగాణకు వస్తోన్నారని, వారు చేసిన ద్రోహాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. తెలంగాణపై రాహుల్ గాంధీ చెప్పే ప్రతి మాటా అబద్ధమేనని ధ్వజమెత్తారు.

గతంలో తెలంగాణ సమాజం మొత్తం ఇందిరాగాంధీ వెంట నడిచిన రోజులు ఉన్నాయని, అయినప్పటికీ.. గాంధీ కుటుంబం మాత్రం ఎప్పుడూ ఇక్కడి ప్రజలకు అండగా నిలిచిన రోజులు లేవని కవిత అన్నారు. ఇప్పుడు వారొచ్చి తెలంగాణకు అది చేస్తాం, ఇది చేస్తాం అంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు.
బీజేపీ అంటే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే బీజేపీ అంటూ కాంగ్రెస్ చేస్తోన్న విమర్శలను కవిత తప్పుపట్టారు. సోనియా గాందీ, రాహుల్ గాంధీలపైనా ఈడీ కేసులు ఉన్నాయని, మరి వారినెందుకు అరెస్ట్ చేయలేదని ఎదురు ప్రశ్న వేశారు. బీజేపీతో కాంగ్రెస్ కుమ్మక్కు కావడం, లోపాయకారి ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్లే సోనియా, రాహుల్‌ను అరెస్ట్ చేయలేదా? అని పేర్కొన్నారు.
తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా ఇచ్చే హామీలన్నీ డొల్లేనని కవిత విమర్శించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఎంత మాత్రం అభివృద్ధి సాధించాయని, ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచినీటిని అందించే రాష్ట్రం తమదేనని, ఇలాంటి ప్రాజెక్ట్ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉందా? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications