కాచిగూడ- యశ్వంత్ పూర్ వందేభారత్ రాకపోకల్లో కీలక మార్పు, ఇక నుంచి..!!
వందేభారత్ రైళ్లకు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ పెరుగుతోంది. కొత్తగా మరో రెండు సర్వీసులను ప్రవేశ పెట్టేందుకు రైల్వే అధికారులు నిర్ణయించారు. ప్రయాణీకుల డిమాండ్ మేరకు మరిన్ని రైళ్ల పైన కసరత్తు జరుగుతోంది. త్వరలోనే పట్టాలెక్కనున్న వందేభారత్ స్లీపర్ రైళ్లల్లో తెలుగు రాష్ట్రాల కు ప్రాధాన్యత ఇస్తామని ఇప్పటికే హామీ లభించింది. కాచిగూడ-యశ్వంత్‌పుర్ వందేభారత్ నిర్వహణ పైన రైల్వే శాఖ కీలక మార్పు చేసింది. ఈ మేరకు అధికారులు ప్రకటన చేసారు.
కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ (20703/04) ఎక్స్‌ప్రెస్‌కు మెయింటెనెన్స్ హాలీడే (ప్రస్తుతం అమల్లో ఉన్న) బుధవారమే ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. వాస్తవానికి ఈ నెల 4వ తేదీ నుంచి మెయింటెనెన్స్ హాలీడేను శుక్రవారానికి మార్పు చేసినట్లు సెప్టెంబరు 12న రైల్వే అధికారులు ప్రకటించారు. అయితే, మెయింటెనెన్స్ హాలీడేతో పాటు స్టాపేజీలు, రైళ్ల వేళల్లోనూ ఎటువంటి మార్పులు లేవని, గతంలో చేసిన ప్రకటనను రద్దు పరిచినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలుకు ఉన్న డిమాండ్ కు అనుగుణంగా రైల్వే శాఖ నిర్ణయాలు తీసుకుంటోంది.

ఇప్పటికే పెరుగుతున్న ప్రయాణీకులకు అనుగుణంగా కాచిగూడ-యశ్వంత్‌పుర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కోచ్‌ల సంఖ్యను డబుల్ చేసారు. కొద్ది రోజుల క్రితం వరకు ఎనిమిది కోచ్‌లతో కొనసాగగా వీటిని రెట్టింపు అంటే 16 కు పెంచారు. దీంతో 14 చైర్‌కార్, రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లతో కాచిగూడ-యశ్వంత్‌పుర్-కాచిగూడ మధ్య వందేభారత్ రైళ్లు సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యం 530గా ఉండగా ఈ కోచ్ ల పెంపుతో 1128కి పెరిగింది. 2023 సెప్టెంబర్ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాచిగూడ-యశ్వంత్‌పుర్-కాచిగూడ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. 14 చైర్‌కార్ బోగీల్లో 1024 మంది, రెండు ఎగ్జిక్యూటివ్ కోచ్‌లలో 104 మంది చొప్పున మొత్తంగా 1128మంది ప్రయాణికులతో ఈ రైలు పూర్తి ఆక్యుపెన్సీతో కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications