హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం..
భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న భాగ్యనగరవాసులకు వరుణుడు చల్లని కబురు అందించాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. కాగా ఉదయం నుంచి నగరంలో ఎండ దంచికొట్టడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే సాయంత్రం వేళకు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వేసవి తాపంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ అకాల వర్షంతో ఊపిరి పీల్చుకున్నారు.
నలుమూలలా విస్తరించిన వాన జల్లులు..
హైదరాబాద్‌లోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో వర్షం తన ప్రభావం చూపింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, కొంపల్లి, సుచిత్ర, అల్వాల్, శేరిలింగంపల్లి, చందానగర్, దుండిగల్, నిజాంపేట్ వంటి ప్రాంతాల్లో వర్షం జోరుగా కురిసింది. అలాగే షాపూర్ నగర్, జీడిమెట్ల, మల్లంపేట, KPHB కాలనీ, బాలాజీ నగర్, మూసాపేట్, ప్రశాంతి నగర్, బాలానగర్ తదితర ప్రాంతాల్లో కూడా వాన పడటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

అయితే వర్షం కారణంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నెమ్మదించింది. పలు చోట్ల రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని గమనించిన జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు మరియు డీఆర్ఎఫ్ (DRF) బృందాలు వెంటనే రంగంలోకి దిగి, నీటి నిల్వలను తొలగించే పనులు చేపట్టారు. ఎక్కడా విద్యుత్ అంతరాయం కలగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మరోవైపు వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న రెండు మూడు రోజుల పాటు నగరంలో ఇలాంటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు, అమాంతం పెరిగిన ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, ఎండలతో అల్లాడుతున్న సామాన్యుడికి ఈ వర్షం ఒక పెద్ద ఊరటనిచ్చిందనే చెప్పాలి.












Click it and Unblock the Notifications