తెలంగాణాలో ద్రోణి ప్రభావం: మూడురోజులపాటు గ్రేటర్ హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో వర్షాలు!!
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్ లో మార్చి నెల ఆరంభంలోనే మండుతున్న వేసవి నుండి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ, ఈ వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు ఆందోళన పడుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రానున్న 24 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ అత్యధిక జిల్లాలలో వర్షాలు కురుస్తాయని ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్లవానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మరో మూడు రోజులపాటు అనేక జిల్లాలలో ఒక మోస్తరువర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇక ఇప్పటికే అనేక జిల్లాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్నదాతలు పంటలు కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. చేతికొచ్చిన వరి ధాన్యం నేల రాలుతుండగా, వర్షాల కారణంగా ఉద్యాన పంటలు కూడా దెబ్బతింటున్నాయి. ఇక అకాల వర్షాలు మామిడి రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.
అనేక ప్రాంతాలలో వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈరోజు తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కర్మాన్ ఘాట్, వనస్థలిపురం, ఎల్బీనగర్ నగర్, కోటి, హయత్ నగర్ వంటి చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. ఈదురు గాలులతో కూడిన వర్షం అనేక ప్రాంతాలలో కురుస్తున్న కారణంగా అక్కడ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.












Click it and Unblock the Notifications