తెలంగాణాలోనూ మరో రెండురోజులపాటు వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్; వాతావరణశాఖ కీలక అప్డేట్!!
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం చల్లబడి రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లోనూ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది.
అయితే తాజాగా మరోమారు వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది .రానున్న రెండు రోజులు పలు జిల్లాలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో వర్ష సూచన ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలలో ఒక మోస్తరు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇక మరోవైపు హైదరాబాదులోనూ అనేక ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతంగా ఉంటుందని ఉదయం పొగ మంచు ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే పలు జిల్లాలలో నిన్న తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, రంగారెడ్డి, జనగామ, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలలో పలుచోట్ల ఒక మోస్తరు వర్షం కురిసినట్టు పేర్కొన్నారు. వరంగల్, నల్గొండ తో పాటు మరికొన్ని జిల్లాలలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసినట్టు హైదరాబాద్లో కూడా వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ పేర్కొంది.
నిన్న అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో బజార్హత్నూర్ లో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పంటలు చేతికి వచ్చే సమయానికి కురుస్తున్న అకాల వర్షాలతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పంటలను కాపాడుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నారు.












Click it and Unblock the Notifications