రేవంత్ రేర్ ఫోటో: ఒకప్పుడు టీఆర్ఎస్‌లో.. గులాబీ కండువా కప్పుకుని!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సందర్భం వచ్చిన ప్రతీసారి.. టీఆర్ఎస్‌తో కయ్యానికి కాలుదువ్వే రేవంత్ రెడ్డి.. ఒకప్పుడు అదే టీఆర్ఎస్ కండువా కప్పుకు తిరిగారన్నది చాలామందికి తెలియని విషయం. రాజకీయాల్లోకి ప్రవేశించిన అనతి కాలంలోనే టీడీపీలో కీలక నేతగా ఎదిగిన రేవంత్ రెడ్డి.. అంతకుముందు టీఆర్ఎస్‌లో కొన్నాళ్ల పాటు కొనసాగారు.

రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ లో పనిచేశారన్న మాటే గానీ.. దానికి సంబంధించిన ఫోటోలేవి ఎప్పుడూ ఎక్కడ దర్శనమివ్వలేదు. తాజాగా ఓ రేర్ ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అప్పట్లో టీఆర్ఎస్ నేతగా.. భుజంపై గులాబీ కండువా కప్పుకుని మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఓ మీటింగ్‌లో ఆయన పాల్గొన్న ఫోటో అది.

rare photo of revanth reddy when he was in trs party

రేవంత్ తన పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో.. కొన్నాళ్ల పాటు బీజేపీకి దగ్గరగా ఉన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. ఆ సమయంలో జిల్లాలో జరిగిన మీటింగ్‌లో పాల్గొన్నదే ఈ ఫోటో. 2006లొ టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా జడ్పీటీసీగా ఎన్నికయ్యారు.

ఆపై 2008లొ టీడీపీ మద్దతుతో ఎమ్మెల్సీగా గెలిచిన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత కొన్నాళ్లకు అదే పార్టీలో చేరారు. 2009లో టీడీపీ టికెట్ మీద కొడంగల్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక అప్పటినుంచి అందులోనే కొనసాగుతూ వస్తున్నారు.

పార్టీలో జూనియరే అయినప్పటికీ.. ఏళ్ల నుంచి పార్టీలో పాతుకుపోయిన సీనియర్లను కాదని, తెలంగాణ తెలుగుదేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడంలో రేవంత్ సఫలమయ్యారు. తెలంగాణ టీడీపీలో ఇప్పుడు రేవంతే పవర్ సెంటర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఓటుకు నోటు వ్యవహారం రాజకీయంగా ఆయనపై ఎలాంటి ముద్ర వేసినప్పటికీ.. మీడియాలో మాత్రం మంచి ఫోకస్ సంపాదించారు. దానికి తోడు దూకుడైన వైఖరితో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఏర్పరుచుకున్నారు. సభ ఏదైనా.. సందర్భమేదైనా.. కేసీఆర్ పై విరుచుకుపడే రేవంత్.. ఈమధ్య సీఎం అవాలనే కలలు కూడా కంటున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీతో తెలంగాణ వ్యతిరేక పార్టీ అన్న ముద్ర వేయించుకున్న టీడీపీకి మళ్లీ పునర్వైభవం వస్తుందో రాదో తెలియని స్థితిలో.. ఆయన మాత్రం తెలంగాణ పగ్గాలు చేపట్టాలని తహతహలాడుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Its a rare photo of Revanth Reddy when he was in TRS party. He wore Pink kanduva of party in that photo
Please Wait while comments are loading...