డోర్నకల్ లో పొలిటికల్ హీట్: రెడ్యా నాయక్ వర్సెస్ డా.రామచంద్రు నాయక్!!
గిరిజన ప్రాంతం అయిన మహబూబాబాద్ జిల్లాలోని రెండు శాసనసభా నియోజక వర్గాల్లో, డోర్నకల్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం. కొత్త పాత అభ్యర్ధుల మధ్య జరుగుతున్న శాసనసభ ఎన్నికల పోరు పలు కారణాలతో ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గాల పునర్విభజనలో STలకు కేటాయించిన డోర్నకల్ నియోజకవర్గం దీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా కొనసాగింది.
ఆరుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన రెడ్యానాయక్, రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్ నుంచి గెలిచినా, ఆపై అధికార TRS లో చేరారు. గత ఎన్నికల్లో TRS నుంచి పోటీ చేసి, తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి Dr. రామచంద్రు నాయక్ పై విజయం సాధించారు. మళ్ళీ ఇద్దరు నాయకులూ ఈ స్థానం కోసం మరోసారి పోటీలో నిలవగా, BJP నుంచి భూక్య సంగీత మొదటి సారి శాసనసభ ఎన్నికల్లో తలపడుతున్నారు.

ఇక, గుర్తింపు పొందిన వివిధ పార్టీల అభ్యర్ధులు, స్వతంత్రులు మొత్తం 14 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నా, ప్రధాన పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. అధికార పక్షం చేసిన అభివృద్ధినీ, స్థానికంగా కల్పించిన మౌలిక వసతులను చూసి తనను మరోసారి గెలిపిస్తారని రెడ్యానాయక్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి మరో సారి బరిలో నిలిచిన Dr రామచంద్రు నాయక్ పార్టీ డిక్లరేషన్ లను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ప్రజాసేవ కోసం వైద్య వృత్తినుంచి వచ్చిన తనను ఈ సారి గెలిపించాలని ప్రచారంలో కోరుతున్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది.
గిరిజన నియోజకవర్గంలో మహిళా అభ్యర్ధిగా బిజెపి నుంచి భూక్య సంగీత ఇంటింటి ప్రాచారం, పాదయాత్రలు చేస్తూ ఓటర్ల మద్దతు కోరుతున్నారు. కుటుంబపాలనతో అభివృద్ధి సాధ్యం కాదనీ, నియోజక వర్గ అభివృద్ధికి ఈ సారి BJP నే గెలిపించాలని ఆమె ప్రచారం సాగిస్తున్నారు.
కాగా, సిట్టింగు సభ్యులు రెడ్యానాయక్, దుందుడుకు పనులు, ప్రత్యర్ధులు, ముఖ్యంగా మహిళలపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు ప్రజలలో వ్యతిరేక చర్చకు అవకాశం ఇస్తోందని స్థానికులు చెబుతున్నారు.మరి ఈ నియోజకవర్గంలో ఓటర్లు మళ్ళీ రెడ్యాకే పట్టం కడతారా? లేక కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తారా అన్నాది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications