TSPSC Paper Leak: ప్రవీణ్ గ్రూప్-1 మెయిన్స్ కు అర్హత సాధించలేదు: జనార్దన్ రెడ్డి
గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని టీఎస్‍పీఎస్సీ తెలిపింది.
గ్రూప్-1 ప్రిలిమినరీ పేపర్ కూడా లీక్ అయిందంటూ వస్తున్న ఆరోపణలతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో టీఎస్‍పీఎస్సీ ఛైర్మన్ బీ. జనార్దన్ రెడ్డి స్పందించారు. ఉద్యోగ నియామక పరీక్షలన్నీ యథావిధిగా జరుగుతాయని చెప్పారు. అయితే ఏఈ పేపర్ తో పాటు గ్రూప్-1 పేపర్ కూడా లీక్ అయిందని.. వెంటనే పరీక్షను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

నిర్ణయించిన తేదీల్లోనే
టీఎస్‍పీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో మాస్ కాపీయింగ్, అవకతవకలు జరిగే అవకాశం లేదని జానార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. నిందితుల దగ్గరనుంచి అన్ని సాక్షాధారాలు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రిక్రూట్మెంట్ పరీక్షలన్నీ నిర్ణయించిన తేదీల్లోనే నిర్వహిస్తామన్నారు.

9 మంది అరెస్ట్
ఏఈ ప్రశ్న పత్రం లీక్ కేసులో పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, రేణుక, ఆమె డాక్యా, రాజేశ్వర్ నాయక్, నీలేష్ నాయక్, గోపాల్ నాయక్, శ్రీనివాస్, రాజేంద్రనాయక్ ఉన్నారు. వీరిని మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ గ్రూప్-1 ప్రిలిమ్స్ రాశాడు.

103 మార్కులు
అతనికి 103 మార్కులు వచ్చినట్లు ఓ ఓఎమ్మార్ షీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన జనార్దన్ రెడ్డి ప్రవీణ్ కు 103 మార్కులు వచ్చిన మాట వాస్తవమేనని, అయితే.. అతను గ్రూప్-1 మెయిన్ పరీక్షకు అర్హత సాధించలేదన్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో 103 మార్కులు టాప్ మార్కులు కాదని తెలిపారు.












Click it and Unblock the Notifications