మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి - రేవంత్ కీలక ప్రకటన..!!
దీపావళి పండుగ వేళ సీఎం రేవంత్ కీలక పిలుపు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసాల్లో ఈ దీపావళి పండుగను ఎంతో ప్రత్యేకంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రులకు సూచనలు చేసారు. ఇప్పటికే గృహప్రవేశాలు పూర్తి చేసుకున్న కుటుంబాల ఇళ్లలో 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' పేరుతో వేడుకలు నిర్వహణ కు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి వేళ మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొనేలా నిర్ణయించారు.
ముఖ్యమంత్రి రేవంత్ దీపావళి వేళ ఆసక్తి కర నిర్ణయం తీసుకున్నారు. ఇందిరమ్మ లబ్ది దారులతో కలిసి దీపావళి చేసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు రేవంత్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు వైరల్ అవుతోంది. అందులో... మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి.. పేదల సొంతింటి కల సాకారమైన వేళ, ఈ దీపావళి పండుగ శుభవేళ... ఇందిరమ్మ ఇండ్లలో, లబ్ధిదారుల సొంతింటి సంతోషంలో... నేను సైతం పాలుపంచుకోనున్నాను. ఈ దీపావళి సందర్భంగా, నేను ఇందిరమ్మ ఇంట్లో, లబ్ధిదారులతో కలిసి పండుగ జరుపుకోనున్నాను. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు.. మీరు సైతం ఇందిరమ్మ ఇండ్లకు వెళ్లి లబ్ధిదారులతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవాలని కోరుతున్నాను..." అంటూ రేవంత్ సూచన చేసారు.

ఇందిరమ్మ టవర్స్ పై కీలక నిర్ణయం
కాగా.. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి తెలిపారు. తొలి విడతలో మంజూరు చేసిన 4.50 లక్షల ఇళ్లలో ఇప్పటివరకు 2,21,500 ఇళ్లలో గృహప్రవేశాలు పూర్తయ్యాయని, మరో 1.90 లక్షల ఇళ్లు విభిన్న నిర్మాణ దశల్లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.40 వేల కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పథకానికి సంబంధించి ప్రతి సోమవారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా పారదర్శకంగా నిధులు జమ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ కార్పొరేషన్లలో జీ+5 (G+5) విధానంలో ఇందిరమ్మ టవర్లను నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ నిర్మాణాలకు దీపావళి నాటికి నోటిఫికేషన్ జారీ చేస్తామని, హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్ల లబ్ధిదారులు వచ్చే ఏడాది బోనాల వేడుకలను తమ సొంతిళ్లలోనే జరుపుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.













Click it and Unblock the Notifications
