ఐటీ అధికారుల ఎదుట రేవంత్ రెడ్డి: ఓటుకు నోటు, కంపెనీల్లో వాటా సహా వీటిపై ప్రశ్నావళి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బుధవారం ఐటీ శాఖ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గత వారం రెండు రోజులకు పైగా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు అక్టోబర్ 3వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరయ్యారు. బషీర్‌బాగ్‌లోని ఐటీ కార్యాలయానికి రేవంత్ ఉదయం చేరుకున్నారు. ఆయనను పలు అంశాలపై ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వెలుగు చూసిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు, అలాగే హామీ ఇచ్చిన రూ.4.50 కోట్ల గురించి కూడా ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.

సోదాల్లో దొరికిన పత్రాల ఆధారంగా విచారణ
గతవారం రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు పలు డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులలోని లాకర్లు కూడా తెరిపించారు. పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత డాక్యుమెంట్లు, లభించిన ఆధారాల మేరకు ఆయనను ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఐటీ అధికారుల ఎదుట సోమవారం విచారణకు హాజరైన ఉదయ్ సిన్హా, సెబాస్టియన్లను కూడా అధికారులు మళ్లీ విచారించనున్నారు.

రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటుపై ప్రశ్నావళి
రేవంత్ రెడ్డి మామ పద్మనాభ రెడ్డి, సోదరుడు కోండల్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హా తదితరులను విచారించిన అధికారులు ముఖ్యంగా ఓటుకు నోటు సందర్భంగా బయటపడిన రూ.50 లక్షళ గురించి ఆరా తీశారు. రేవంత్ రెడ్డిని కూడా ఆ కోణంలో ప్రశ్నించేందుకు ఐటీ అధికారులు ప్రశ్నావళి రూపొందించారని తెలుస్తోంది.

ఆ కంపెనీలో వాటాపైనా ఆరా తీసే అవకాశం
ఓటుకు నోటు కేసులో రూ.50 లక్షల గురించే ఐటీ అధికారులు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారని తెలుస్తోంది. రేవంత్ బావమరిది జయప్రకాశ్ రెడ్డికి చెందిన శ్రీ సాయి మౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రయివేటు లిమిటెడ్‌లో రూ.20 కోట్ల లెక్క తేలని ఆదాయాన్ని గుర్తించిన అధికారులు.. రేవంత్ రెడ్డి భాగస్వామ్యం పైనా ఆరా తీసే అవకాశాలున్నాయి.

ఇంటి పేరుపై ఉన్న కంపెనీలపైనా ఆరా
తన సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన భూపాల్ ఇన్ ఫ్రా కంపెనీతో రేవంత్‌కు ఉన్న సంబంధాలపైనా వివరాలు సేకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో రేవంత్ ఇంటి అడ్రస్ పైన పలు కంపెనీలు రిజిస్టర్ అయ్యాయని ఐటీ అధికారులు గుర్తించారు. అయితే, తమ ఇంట్లో అద్దెకు ఉన్న వారి కంపెనీల పేర్లు అని రేవంత్ చెప్పారు. ఆయా కంపెనీలతో రేవంత్‌కు ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలోనూ ఆరా తీయనున్నారు. మొత్తంగా ఓటుకు నోటు డబ్బులు, రూ.20 కోట్ల లెక్క, సోదరుడి కంపెనీలో వాటా, తన ఇంటి అడ్రస్‌లోని కంపెనీలపై ఆరా తీయనున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications