తెలంగాణా మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పబోతున్న రేవంత్ సర్కార్!
తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో మహిళలకు మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. గృహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. ఇక ఇదే క్రమంలో మహిళల సంక్షేమానికి మరింత పెద్దపీట వేయాలని ప్రయత్నం చేస్తుంది.
మహిళల కోసం మరిన్ని పథకాలు
తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం మరిన్ని పథకాలను ప్రవేశపెట్టాలని భావిస్తోంది.మార్చి 8వ తేదీన అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రంలో మహిళల ఘనత చాటేలా మూడు రోజులపాటు వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే స్త్రీ సంక్షేమ పథకాలపై చర్చించడం కోసం మంత్రి సీతక్క నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీల సభ్యులుగా ఐఏఎస్ అధికారులు అనిత రామచంద్రన్, శైలజ రామయ్యర్, దివ్య దేవరాజన్ ఉన్నారు.

మహిళా సాధికారత సాధించే దిశగా అడుగులు
ఈ కమిటీ డైరెక్షన్లో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు. అంతేకాదు మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రాలలో మహిళలకు పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీ లను ఇప్పించేందుకు వీలుగా ఆయిల్ కంపెనీలతో ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. మహిళా సాధికారత సాధించే దిశగా అడుగులు వేస్తుంది.
అంగన్వాడీ టీచర్లు, సహాయకుల పదవీ విరమణ ప్రయోజనాల పెంపు
స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలను ఒక చోటుకు తీసుకువచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం ఈ మహిళా దినోత్సవం పురస్కరించుకొని అంగన్వాడీ టీచర్లు, సహాయకుల పదవీ విరమణ ప్రయోజనాలను పెంచాలని కూడా నిర్ణయించింది.ఈ మేరకు కసరత్తు చేస్తుంది.
మహిళా దినోత్సవ కానుకలు ఇవ్వటానికి ప్లాన్
అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షల రూపాయలు, సహాయకులకు లక్ష రూపాయలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. అంగన్వాడి సిబ్బందికి మహిళా సంఘాల సభ్యులకు చీరలు ఇవ్వాలని, స్వయం సహాయక బృందాలకు వడ్డీ రాయితీ చెక్కులు ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల స్టాల్స్ కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మొత్తంగా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కానుక ఇవ్వాలని నిర్ణయించింది.












Click it and Unblock the Notifications