రేవంత్ సర్కార్ మరో షాక్.. ఆ వాహనాలు రోడ్డెక్కితే సీజ్!
తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రంలో రవాణా వ్యవస్థ ను ప్రక్షాళన చేయడానికి రంగంలోకి దిగారు. ప్రజల సురక్షిత ప్రయాణం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రోడ్ సేఫ్టీ పైన ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలలో విద్యార్థుల కోసం నిర్వహించబడుతున్న బస్సుల పైన దృష్టి సారించారు. ఈ క్రమంలో మంత్రి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
స్కూల్ బస్సులపై కీలక ఆదేశాలు
స్కూల్ బస్సుల పై నిరంతరం తనిఖీలు నిర్వహించాలని 15 సంవత్సరాలు దాటిన స్కూల్, కళాశాల బస్సులను సీజ్ చేయాలని రవాణా శాఖ అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. రోడ్ సేఫ్టీ పైన స్కూల్స్, కాలేజీలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు.

వాటిపై నివేదిక కోరిన రవాణా మంత్రి
15 సంవత్సరాలు దాటిన స్కూల్ బస్సులను తక్షణం సీజ్ చేయాలని ఆదేశించిన ఆయన స్కూల్ బస్సుల తనిఖీలలో భాగంగా ఫిట్నెస్, ఇన్సూరెన్స్, ఆర్సి, అన్నిటిని చెక్ చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25వేల స్కూల్ బస్సుల పైన తనకు నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. 15 సంవత్సరాలు దాటిన ప్రైవేటు వాహనాలకు గ్రీన్ టాక్స్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు.
ఈవీ పాలసీపై మంత్రి పొన్నం ప్రభాకర్
దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా కాలుష్యాన్ని తగ్గించడం కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని ఇందులో భాగంగానే ఈవీ పాలసీని తీసుకువచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 62 రవాణా శాఖ కార్యాలయాలలో అవసరమైన కొత్త భవనాలు, మౌలిక సదుపాయాల కల్పన పైన ప్రత్యేకమైన దృష్టి సారిస్తామన్నారు.
రవాణా కార్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై మంత్రి
దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణా కార్యాలయ భవనాలలో అవసరాలపైన 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. ఇక రవాణా శాఖకు ప్రత్యేకంగా లోగో రాబోతుందని, దానిని ప్రజా విజయోత్సవాలలో ఆవిష్కరిస్తామని వెల్లడించారు. రవాణా అధికారులకు ప్రత్యేక వాహనాలు ఇస్తామని, డేటా ఎంట్రీ కోసం ట్యాబ్ లు ఇస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications