రేవంత్ రెడ్డి ఇంట్లో కంపోజింగ్ పెట్టిన కీరవాణి: ట్యూన్లు రెడీ
MM Keeravani: జూన్ 2వ తేదీన ఆవిర్భావ దశమ దినోత్సవాల కోసం.. తెలంగాణ సర్వసన్నద్ధమౌతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగే తొలి వేడుకలు కావడం వల్ల దీన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వైభవంగా వ్యవస్థాపక దినోత్సవాలను జరుపుకోవడానికి చర్యలు తీసుకుంటోంది.
ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ హాజరు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు దేశ రాజధానిలో ఆమెతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకు హాజరు కావాలంటూ ఆహ్వానించారు. ఇవే ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కొత్త లోగోను ఆవిష్కరించబోతోంది. దీనికోసం రేవంత్ రెడ్డి ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు.

లోగోతో పాటు తెలంగాణ రాష్ట్ర గీతాన్నీ విడుదల చేస్తారు రేవంత్ రెడ్డి అదే రోజున. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో అందె శ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గేయంగా ఖరారు చేసింది ప్రభుత్వం. దీనికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.
ఈ గీతానికి మ్యూజిక్ కంపోజింగ్ దాదాపుగా పూర్తయినట్టే కనిపిస్తోంది. ఈ మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో కంపోజింగ్ పెట్టారు కీరవాణి. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, గేయ రచయిత అందె శ్రీ, అద్దంకి దయాకర్.. తదితరులు ఇందులో పాల్గొన్నారు. వారికి ట్యూన్లను వినిపించారు కీరవాణి.
నేపథ్య గాయకుడు ఎల్ వీ రేవంత్ సహా కొందరు ప్లేబ్యాక్ సింగర్లు.. జయ జయహే తెలంగాణ గేయాన్ని పాడి వినిపించారు. అందెశ్రీ రాసిన గీతం ఇది. జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం.. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అంటూ సాగుతుంది. తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసేలా, ప్రతి ఒక్కరిలో స్ఫూర్తినింపేలా అందెశ్రీ రాశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కోట్లాదిమంది నోట్లో నానిందీ పాట.
అత్యంత ప్రజాదరణ పొందిన ఈ గీతాన్ని ఇదివరకే రాష్ట్ర గేయంగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర వేడుకలు, తెలంగాణ లిబరేషన్ డే సహా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ జాతీయ గీతంతో పాటు ఈ పాటను వినిపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.












Click it and Unblock the Notifications