కేసీఆర్‌కు అలాంటి వాళ్లే ఎమ్మెల్యేలుగా కావాలి: రేవంత్ రెడ్డి విమర్శలు
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి చరమ గీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy). ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జనగామలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ ప్రసంగించారు. రాష్ట్రంలో దొరల పాలనకు, ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
విజయభేరి సభకు వచ్చిన జన సందోహాన్ని చూస్తుంటే.. కాలనాగుల పని పట్టడానికి పుట్టలో నుంచి చీమలు బయటకు వచ్చినట్లుందని రేవంత్ వ్యాఖ్యానించారు. జనగామలో పల్లా రాజేశ్వర్ ను ఓడించి బొంద పెట్టడానికి వచ్చిన ప్రజలకు అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. పొన్నాల లక్ష్మయ్య లేడని ఇక్కడ ఇబ్బంది జరుగుతుందేమో అనుకున్నానని.. కానీ, సభకు వచ్చిన ప్రజలను చూశాక ధైర్యం వచ్చిందని రేవంత్ చెప్పుకొచ్చారు.

పొన్నాల.. కేసీఆర్ పంచన చేరితే ఆయన గౌరవం ఏమైనా మిగిలిందా? అని రేవంత్ ప్రశ్నించారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తలను మోసం చేసి.. పొన్నాల శత్రువు పంచన చేరాడని మండిపడ్డారు. అమెరికాలో మాట్లాడుకుని బీఆర్‌ఎస్‌లోకి చేరాడని విమర్శించారు.
కన్నతల్లి లాంటి పార్టీని, కార్యకర్తలను మోసం చేసినవారికి బండకేసి కొట్టాలని ప్రజలకు రేవంత్ పిలుపునిచ్చారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి అక్రమాల గురించి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేశాడని.. వీళ్లిద్దరి బాగోతం గడీలో ఉన్న దొరకు తెలుసని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతంలోని మట్టికి ఒక పౌరుషం ఉందని, దొరల రాజ్యంపై పోరాటం చేసి ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర ఈ ప్రాంతానిదని రేవంత్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఉద్యమం, సాయుధ పోరాటంలో జనగామ ప్రజలకు ప్రత్యేక స్థానముందన్నారు రేవంత్ రెడ్డి. జనగామ గడ్డ.. కాంగ్రెస్ పార్టీ అడ్డా అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తనకు కట్టు బానిసల్లా ఉండే ఎమ్మెల్యేలు కావాలని కోరుకుంటున్నారని.. తన కాళ్ల దగ్గర పడి ఉండేవాళ్లనే గెలవాలని భావిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. జనగామ ప్రజలు లక్ష కోట్లు దోచుకున్న దొంగ వైపు ఉంటారో.. ధర్మం వైపు ఉంటారో ఆలోచించాలన్నారు రేవంత్.












Click it and Unblock the Notifications