తుమ్మల గాడిదలు కాసేవారు, తలసాని బ్లాక్ టిక్కెట్లు అమ్మేవారు: 'నమస్తే తెలంగాణ'పై రేవంత్ సెటైర్
హైదరాబాద్: నమస్తే తెలంగాణ పత్రిక మిర్చీ బండివాళ్లకు పొట్లాలు కట్టేందుకే ఉపయోగపడుతుందని, ఆ పత్రికలో తెరాసకు 80 సీట్లు వస్తాయని రాశారని, 60 సీట్లు రావొచ్చని కెసిఆర్ చెబుతున్నారని, కానీ 30 సీట్లు వస్తాయని ఇంటెలిజెన్స్ సర్వే చెబుతోందని టిడిపి నేత రేవంత్ రెడ్డి అన్నారు.
తండ్రి కెసిఆర్, కొడుకు కెటిఆర్ ఇద్దరు తోడు దొంగలే అన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కెసిఆర్ ఎన్నో హామీలు ఇచ్చాడని, కానీ ఏం చేయలేదన్నారు. గ్రేటర్ ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు కూడా అంతే అన్నారు. రేవంత్ యూసుఫ్‌గూడ, ఎల్బీనగర్ ప్రాంతాల్లో రోడ్డు షో నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. టిడిపి హైదరాబాద్‌లోనే పుట్టిందని, తెలుగు ప్రజలందరికీ సేవచేసేందుకు తిరిగి ఇక్కడ కూడా అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు వస్తే తాను కచ్చితంగా రాజీనామా చేస్తానంటూ పునరుద్ఘాటించారు.

పార్టీ ఫిరాయించిన వారిని ఈఎన్నికల్లో ఓడించాలని కోరారు. సీఎం కేసీఆర్ సచివాలయానికి రాకుండా ఫామ్‌హౌస్‌లో ఉండి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మహిళా మంత్రులు లేని పాలన దేశంలో టిఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.
హైటెక్ సిటీ నిర్మాణం, మెట్రోరైలు ప్రతిపాదనలు, కృష్ణాజలాలను నగరానికి తెచ్చింది టిడిపియేనని చెప్పారు. ఇక్కడ నివసించే వారు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. టిడిపి హయాంలో రౌడీలను తరిమి కొడితే ఇప్పుడు కెసిఆర్ కనీసం దోమలను కూడా కొట్టడం లేదన్నారు.
నారాయణఖేడ్‌లో హరీష్ రావు తెలంగాణవాదం వినిపిస్తుంటే, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మంత్రి కెటి రామారావు ఆంధ్రా ఓట్ల కోసం ఆయింటుమెంట్ రాస్తున్నారని ఎద్దేవా చేశారు. టిడిపి లేకుంటే మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బర్రెలు కాసుకునేవారని, గాడిదల పండ్లు తోముతూ బతికేవారన్నారు.
అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలుగడ్డలు అమ్ముకుంటూ, సినిమా థియేటర్ల వద్ద బ్లాక్ టిక్కెట్లు అమ్ముకునే వారని మండిపడ్డారు. టిడిపి హైదరాబాదులోని ఎమ్మెల్యే క్వార్టర్సులో పుట్టిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.
జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తే పైప్‌లైన్ల ద్వారా ఇంటింటికి గ్యాస్ సౌకర్యం కల్పిస్తామని కేంద్రమంత్రి దత్తాత్రేయ హామీ ఇచ్చారు. శనివారం కాచిగూడ లింగంపల్లి చౌరస్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే ఢిల్లీ నిధులివ్వాలని, తెరాస ప్రభుత్వం లక్ష ఇళ్లను నిర్మిస్తామని చెబుతోందని, దీనికి రూ.7 లక్షల కోట్లు అవసరమని, ఇంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేదని, ఈ నిధులు విడుదల కావాలంటే హైదరాబాద్ నగరంలో బిజెపి గెలిచి తీరాలన్నారు.












Click it and Unblock the Notifications