రేవంత్ రెడ్డి సీఎంగా ఐదేళ్లు ఉండాలి!: కేటీఆర్ హాట్ కామెంట్స్
హైదరాబాద్: లగచర్ల ప్రజల తరపున తప్పకుండా న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ గ్రామాల ప్రజలకు అండగా ఉంటామని, తప్పకుండా ఆదుకుంటామని చెప్పారు. తెలంగాణ భవన్‌లో లగచర్ల బాధిత మహిళలతో కేటీఆర్ సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో పలు అంశాలపై ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డికి తానంటే చాలా ప్రేమ ఉన్నట్లు ఉందని.. అందుకే తనను టార్గెట్ చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. కొడంగల్‌లో జరిగిన ఘటనతో ప్రభుత్వం ఉలిక్కిపడిందని.. కావాలనే తమపై ప్రభుత్వం డైవర్షన్ చేస్తుందని మండిపడ్డారు. లగచర్ల భూసేకరణలో తీవ్రంగా భంగపడిన ప్రభుత్వం కుట్ర అంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఘటన జరిగినప్పుడు అక్కడ లేని బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకెళ్లి అమానుషంగా కొట్టారని ధ్వజమెత్తారు.

సురేశ్ అనే వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్తలేనని.. ఆయనకు 7 ఎకరాల భూమి ఉందని కేటీఆర్ తెలిపారు. లగచర్ల ఘటనలో పూర్తిగా ఇంటెలిజెన్స్, పోలీసుల వైఫల్యం ఉందన్నారు. రైతులపై దాడికి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ కు వెళ్లినట్లు వెళ్లారని కేటీఆర్ మండిపడ్డారు. హరగోపాల్, కోదండరాం లాంటి వారు కనీసం ఈ ఘటనపై మాట్లాడటం లేదన్నారు. మావోయిస్టులు స్పందించారు కానీ.. ఎవరూ మాట్లాడటం లేదన్నారు.
ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ అని రేవంత్ రెడ్డి మాటలు చెబుతున్నారు.. కానీ, అవి సాధ్యం కాదన్నారు కేటీఆర్. కొడంగల్ ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అని ప్రశ్నించారు. ప్రజలు కూడా ఇదే విషయాన్ని అడుగుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రికి తన సొంత నియోజకవర్గంపై కూటా పట్టులేదన్నారు. తాము సీఎం నియోజకవర్గంలోనే కలెక్టర్‌పై దాడి చేసేంత బలమైన వ్యక్తులమా? అని ప్రశ్నించారు. వీళ్లకు ప్రభుత్వం నడపడం చేతకావడం లేదని రేవంత్ సర్కారుపై విమర్శలు గుప్పించారు కేటీఆర్.
పక్కాగా చెబుతున్నా.. నాలుగేళ్ల తర్వాత అధికారంలోకి వస్తున్నామని కేటీఆర్ అన్నారు. అధికారులారా.. జాగ్రత్త అంటూ హెచ్చరించారు. నిన్న రిమాండ్ రిపోర్టు బోగస్ అని అన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో ఉన్నారా? కాంగ్రెస్ ఉన్నారా? అని ప్రశ్నించారు. రేవంత్ దోస్తు కదా.. అందుకే కొండా విశ్వేశ్వర్ రెడ్డి అలా మాట్లాడుతున్నారని అన్నారు. బండి సంజయ్ రేవంత్ రెడ్డి సహాయ మంత్రి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
లగచర్లలో మహిళల ఛాతిపై కాలు పెట్టి తొక్కి వారి భర్తలను అరెస్టు చేశారని కేటీఆర్ ఆరోపించారు. దీనిపై మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తనను అరెస్ట్ చేసి జైల్లో పెడితే.. కొన్ని రోజుల తర్వాత బయటికి వస్తాను కదా అని అన్నారు. బయటికి వచ్చి మళ్లీ ఇంకా గట్టిగా మాట్లాడతానని చెప్పారు.
వెలదండలో రేవంత్ భూములు ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. ఇంకా కొంటున్నారు. రేవంత్ అన్నదమ్ములు ఇంకా కొంటున్నారు. అగ్రిమెంట్ చేసుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. పైనుంచి కాంగ్రెస్ పెద్దలు డబ్బులు అడుతున్నారు.. అందుకే ఏదో ఒకటి చేసి పైకి డబ్బులు పంపాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు.
'నేను డబ్బులు తీసుకోలేదు. డ్రగ్స్ తీసుకోలేదు. నేను ఏ తప్పు చేయలేదు.
కేసీఆర్‌ను ఫినిష్ చేస్తాడట.. ముందు నువ్వు ఫినిష్ కాకుండా చూసుకో.. అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి సీటు కోసం భట్టి.. పొంగులేటి.. ఉత్తమ్ పోటీ పడుతున్నారన్నారు. తెలంగాణలో భూముల రేట్లు పెరిగాయని, అందుకే రైతులు ఆందోళన చేస్తున్నారన్నారు.
భూమితో రైతులకు ఒక ఎమోషన్ ఉంటుంది.. అందుకే వ్యతిరేకిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని.. అప్పుడే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటే వేయాలంటే భయపడతారని అన్నారు. రాజకీయాల్లో ఒక చట్ట సవరణ జరగాలని.. ఒక వ్యక్తి రెండు సార్లకంటే ఎక్కువ ప్రధాని, సీఎం కాకుండా ఒక నిర్ణయం జరగాలని కేటీఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications