ధరణి పోర్టల్ పేరుతో వస్తే తిరగబడండి: కేసీఆర్ సర్కారుపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
హైదరాబాద్: ధరణి పోర్టల్ పేరుతో సామాన్య, పేద ప్రజల భూములను కబ్జా చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. సాయుధ తిరుగుబాట్లతో దొరల గడీల నుంచి విముక్తి పొందిన తెలంగాణలో సీఎం కేసీఆర్ నయా భూస్వాములను తయారు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ధరణి సమస్యలను నిరసిస్తూ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్‌లో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధరణి రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ధరణి పోర్టల్ పేరు చెప్పి భూముల జోలికి ఎవరైనా వస్తే.. తిరుగబడాలని రేవంత్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ మాయమాటలు ఎవరు నమ్మరన్నారు. ధరణి పోర్టల్ రద్దు చేసేవరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రెవెన్యూ సదస్సుల పేరుతో సీఎం కేసీఆర్ కొత్త నాటకానికి తెరతీశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామన్నారు.

ధరణి పేదల బతుకుల్లో నీళ్లు పోస్తోందని, రైతుల జీవితాలు ఆగమయ్యాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మూడు చింతలపల్లి మండలం లక్ష్మాపూర్ లో ధరణి మొదలు పెట్టి.. అక్కడ పేదలకిచ్చిన అసైన్డ్ భూమిని వివిధ కారణాలతో గుంజుకుందని ధ్వజమెత్తారు. వరంగల్ లో కూడా అభివృద్ధి పేరుతో భూములను లాక్కునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తరతరాలుగా వస్తున్న భూమిని సర్కారే అన్యాయంగా లాక్కోవడం సిగ్గుచేటని అన్నారు.
ధరణి పోర్టల్ కారణంగా భూమి మీద హక్కు కోసం,మా భూమి మాదే అని నిరూపించుకోవడానికి సాయుధ రైతాంగ పోరాటానికి మించి ఉద్యమించాల్సిన పరిస్థితి.
— Revanth Reddy (@revanth_anumula) July 6, 2022
సొంత భూమిపై పేదోడి హక్కు లేకుండా గుప్పెడు మంది పెట్టుబడిదారులకు వరంలా మారిన ధరణి పోర్టల్ కు వ్యతిరేకంగా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధరణి రచ్చబండ. pic.twitter.com/A9akpalHcR
ఇప్పటివరకు రాష్ట్రంలో 30లక్షల ఎకరాల భూమి మాయమైందన్నారు రేవంత్. పేద ప్రజలు ఆత్మగౌరవంగా బతకాలని ఒకేసారి కాంగ్రెస్ ప్రభుత్వం పంచిన 25లక్షల ఎకరాల భూమితో పాటు 5లక్షల ఎకరాల పోడు భూములను కూడా ఆగం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో భూమే ఆత్మగౌరవమని, దానినే దెబ్బతీసే ప్రయత్నం సీఎం కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. పాత రికార్డులన్నీ మాయం చేసి.. రెవెన్యూ వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం నాశనం చేసిందని రేవంత్ ధ్వజమెత్తారు.