సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి అల్టిమేటం; ధాన్యం కొనుగోలు కార్యాచరణ చెప్పండి, లేదంటే ..
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల రగడ కొనసాగుతోంది. తెలంగాణ రైతాంగం సాగుచేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు టిఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహిస్తే, రైతుల పక్షాన పోరాటం చేస్తున్నామంటున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయని తెలంగాణ సర్కారు తీరును, ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ భారీ నిరసన ర్యాలీ చేసింది. ఈ సందర్భంగా టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలుపై కార్యాచరణను ప్రకటించాలని సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి డెడ్లైన్ విధించారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ యాక్టింగ్ కమిటీగా ఏర్పడి మోసం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జేఏసీగా, జాయింట్ యాక్టింగ్ కమిటీగా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడు లక్షల కోట్ల అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టారని చెబుతున్న ప్రభుత్వాన్ని కమిషన్లు అడగడం లేదని పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. టిఆర్ఎస్, బీజేపీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇందిరా పార్క్ వద్ద సీఎం కేసీఆర్ చేసిన దీక్షను ఎద్దేవా చేశారు.

ఏసీలు పెట్టుకుని ఎవరైనా ధర్నాలు, దీక్షలు చేస్తారా ?
సీఎం కేసీఆర్ రైతుల పక్షాన మాట్లాడతారని చూశామని, కానీ సీఎం కేసీఆర్ ఏం చేశారో అర్ధం కాలేదన్నారు. ఏసీలు పెట్టుకుని ఎవరైనా ధర్నాలు, దీక్షలు చేస్తారా అంటూ ప్రశ్నించారు. రైతుల పక్షాన పోరాటం చేయాలంటే కేసీఆర్ స్వయంగా రైతుల దగ్గర కు వెళ్లాలని, వారి సమస్యలను తెలుసుకోవాలని లేదా చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించాలని అవి లేకుండా అవాక్కయ్యే ఏర్పాట్లు చేసుకుని, చక్కగా ఇందిరా పార్కు లో కూర్చున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

సీఎం కేసీఆర్ కు ధాన్యం కొనుగోలుపై డెడ్ లైన్ విధించిన రేవంత్ రెడ్డి
బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ నిలదీయాలని, రేవంత్ రెడ్డి బిజెపి నేతలను టార్గెట్ చేశారు. కేంద్ర రాష్ట్ర సర్కారు రైతులు మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. నవంబర్ 19 వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కల్లాల్లోకి కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుందని ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఈ నెల 23వ తేదీ వరకు కేసీఆర్ కు సమయం ఇస్తున్నామని డెడ్లైన్ విధించారు రేవంత్ రెడ్డి .ఈలోపు సీఎం కేసీఆర్ ధాన్యం సేకరణపై కార్యాచరణను ప్రకటించకుంటే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
Recommended Video

జేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టుకున్నట్లు చేస్తూ మధ్యలో రైతులని చంపే ప్రయత్నం
తెలంగాణ రైతాంగం సాగు చేసిన ప్రతి ధాన్యం గింజ కొనే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నట్లు చేస్తూ మధ్యలో రైతులని చంపే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రైతులు ధాన్యం కొనుగోలు వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదని, అందులో భాగంగానే రేపటి నుంచి రైతన్నలు కుప్ప పోసిన కల్లాల దగ్గరకు వెళ్ళి నేరుగా వారి సమస్యలను అడిగి తెలుసుకుంటా మని స్పష్టం చేశారు. ఇప్పటికే కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డి అల్టిమేటం పై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications