Revanth Reddy: 20 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కేసీఆర్ అధికారిక నివాసం నేమ్ ప్లేట్ ఛేంజ్, కానీ
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో దేశ రాజధాని ఢిల్లీ తుగ్లక్ రోడ్డు నివాసం వద్ద కేసీఆర్ పేరుతో ఉన్న నేమ్ ప్లేట్‌ను అధికారులు మార్చారు. గత 20 ఏళ్లుగా తుగ్లక్ రోడ్డులోని 23వ నెంబర్ బంగ్లా కేసీఆర్ అధికారిక నివాసంగా ఉండేది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఆ బంగ్లాను ఖాళీ చేశారు. ఆయన వ్యక్తిగత వస్తువులను సిబ్బంది వేరే చోటికి తరలించారు.
కాగా, 2004 నుంచి 2014 వరకు ఎంపీగా, మంత్రిగా తుగ్లక్ రోడ్డు నివాసం నుంచే కేసీఆర్ కార్యకలాపాలు సాగించారు. ఆ తర్వాత 2014 నుంచి 2023 డిసెంబర్ తొలి వారం వరకు అదే బంగ్లా తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అధికారిక నివాసంగా ఉంది. ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ సిబ్బంది.. బంగ్లాను ఖాళీ చేసి తెలంగాణ భవన్ అధికారులకు అప్పగించారు.

తుగ్లక్ రోడ్డులోని బంగ్లా దాదాపు 20 ఏళ్లపాటు కేసీఆర్ అధికారిక నివాసం ఉంది. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత మంగళవారం తొలిసారిగా ఈ బంగ్లాను రేవంత్ రెడ్డి సందర్శించారు. ఎంఎస్ ప్లాట్స్ యమున అపార్ట్‌మెంట్‌లో 902 ప్లాట్ ప్రస్తుతం రేవంత్ నివాసంగా ఉంది. ఎంపీగా రాజీనామా చేసిన నేపథ్యంలో త్వరలో ఆయన ఆ ఫ్లాట్ ను ఖాళీ చేయనున్నట్లు సమాచారం. తుగ్లక్ రోడ్డు బంగ్లాలో మార్పులు చేర్పుల తర్వాత పూజ చేసి అధికారికంగా బంగ్లాను వినియోగించుకోవాలనే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలిసింది.
ఉర్దూలో లేకపోవడంపై సీఎం ఆగ్రహం
ముఖ్యమంత్రి నేమ్ ప్లేట్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలోనే ఉంది. అయితే, తెలంగాణలో రెండో అధికారిక భాష అయిన ఉర్దూలో పేరు, వివరాలు లేకపోవడంపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
నూతన తెలంగాణ భవన్‌పై రేవంత్ ఇలా
మరోవైపు, ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. తన నివాసంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, భవన్ ఓఎస్డీ సంజయ్ జూజూతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ భవన్ మొత్తం విస్తీర్ణం ఎంత, అందులో ఉన్న భవనాలు, వాటి స్థితి, అందులో తెలంగాణ వాటా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడిగా 19.78 ఎకరాల భూమి ఉందని అధికారులు తెలిపారు. ఇందులో ఉమ్మడి భవన్ పరిధిలోని 8.781 ఎకరాల్లో శబరి బ్లాక్, అంతర్గత రహదారులు, గోదావరి బ్లాక్, 3359 ఎకరాల్లో ఓల్డ్ నర్సింగ్ హాస్టళ్లు, 7.641 ఎకరాల్లో పటౌడీ హౌస్ ఉన్నాయని అధికారులు తెలిపారు.
తెలంగాన వాతా కింద ఎంత భూమి వస్తుందని సీఎం రేవంత్ ప్రశ్నించడంతో.. రాష్ట్ర పునర్ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 8.245 ఎకరాల భూమి వస్తుందని, ఏపీకి 11.536 ఎకరాలు వెళ్తుందని అధికారులు వివరించారు. ప్రస్తుత భవనాల స్థితి, అధికారులు, సిబ్బంది నివాస గృహాల స్థితిపై సీఎం ఆరా తీశారు. దాదాపు 4 దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో చాలా వరకు శిథిలావస్థకు చేరాయని, మరమ్మతులు చేయిస్తున్నామని రెసిడెంట్ కమిషనర్ గౌవర్ ఉప్పల్ తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించేలా నూతన భవనం నిర్మించుకుందామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications