తీన్మార్ మల్లన్న గెలుపు కోసం రంగంలోకి రేవంత్ రెడ్డి
ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బుధవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన జూమ్ సమావేశంలో అభ్యర్థి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్), మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇంచార్జీలు, అసెంబ్లీ నియోజక వర్గ ఇంఛార్జీలు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్నను గెలిపించేందుకు పనిచేయాలని పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి దిశనిర్దేశం చేశారు. మూడు ఉమ్మడి జిల్లాల నాయకులు క్రియాశీలకంగా పనిచేయాలని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మే 27న పోలింగ్ ఉన్నందున క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, మండల స్థాయి నాయకులను సన్నద్ధం చేయాలని సూచించారు.

ప్రతి ఎమ్మెల్యే తమ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్‌లను సందర్శించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వారధిగా పని చేస్తారని, తీన్మార్ మల్లన్నఎన్నిక.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికగా పని చేసి గెలుపునకు పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు.
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార కాంగ్రెస్ తోపాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ మూడు పార్టీలు కూడా తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తుండగా.. బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి బరిలో ఉన్నారు.
కాగా, 2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.
ఈ పోరులో మొత్తం 52మంది అభ్యర్థులు ఉన్నారు.












Click it and Unblock the Notifications