తెలంగాణా రెవెన్యూ కోర్టులు రద్దు .. ట్రిబ్యునల్స్ ఏర్పాటు .. 15లక్షల ఎకరాల భూవివాదాల పరిష్కారానికే !
రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు నడుం బిగించింది తెలంగాణ ప్రభుత్వం .ఆర్ వో ఆర్ 2020 చట్టంతో రెవెన్యూ సంస్కరణలకు తెరతీసిన తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. రెవెన్యూ కోర్టులను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది . రెవెన్యూ కోర్టుల్లో భూములకు సంబంధించిన వ్యాఖ్యలు ఏళ్ళ తరబడి పరిష్కారం కావడం లేదని గుర్తించిన నేపథ్యంలోనే రెవెన్యూ కోర్టులను రద్దుచేసి వాటి స్థానంలో ల్యాండ్ ట్రిబ్యునల్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
Recommended Video

జిల్లాకి ఒక ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు .. రాష్ట్ర వ్యాప్తంగా ౩౩ ట్రిబ్యునల్స్
తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ సివిల్ కోర్టులలో చాలా ఏళ్లుగా భూ వివాదాలు పరిష్కారం కాకుండా ఉన్న నేపథ్యంలో రెవెన్యూ కోర్టులను రద్దు చేసి జిల్లాకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ట్రిబ్యునల్స్ ద్వారా వేగంగా భూ వివాదాలు పరిష్కారం చెయ్యాలని నిర్ణయించింది . అందులో భాగంగా జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయనున్నారు. తహసిల్దార్, ఆర్డిఓ ,జేసీ ,సిసిఎల్ఎ స్థాయిలో నిర్వహించే రెవెన్యూ కోర్టులోని కేసులన్నింటినీ వీటి పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది.

రెవెన్యూ కోర్టుల్లో ఏళ్ళ తరబడి పరిష్కారం కాని వివాదాలు
ఇప్పటివరకు భూ యాజమాన్య హక్కుల కల్పన చట్టం క్రింద తహసిల్దార్, ఆర్డీవో ,సంయుక్త కలెక్టర్ లనుండి భూపరిపాలన కమిషనర్, రెవెన్యూ మంత్రి వరకు భూవివాదాలు అప్పీళ్ళకు అవకాశం ఉండేది. భూవివాదాల విషయంలో ఇరువర్గాలకు నోటీసులు జారీ చేసి, ఈ వివాదాన్ని పరిష్కరించి తీర్పులు ఇచ్చే అధికారాలు దిగువ స్థాయి అధికారులలోనూ ఉండేవి. అయితే రెవెన్యూ కోర్టుల్లో భూమి వివాదాలు ఏళ్ళతరబడి పరిష్కారం లభించకుండా, కొనసాగుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త చట్టంతో ఇప్పటివరకు రెవెన్యూ వివాదాలు పరిష్కారం కోసం విచారణ చేసిన వారి అధికారాలకు కత్తెర పడనుంది.

రాష్ట్ర స్థాయిలో అప్పిలేట్ అధారిటీ , సెకండ్ అప్పీల్ కోసం హైకోర్టులో స్పెషల్ బెంచ్
జిల్లా స్థాయిలో ట్రిబ్యునళ్లు, రాష్ట్ర స్థాయిలో అప్పిలేట్ అథారిటీ, సెకండ్ అప్పీల్ కోసం హైకోర్టులో స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తుంది. రాష్ట్రంలో సివిల్ రెవిన్యూ కోర్టులో కేసు నడుస్తున్న భూములతో పాటు భూ బదలాయింపు నిషేధ చట్టంలోని భూములు, సరిహద్దు వివాద భూములు, కుటుంబ వివాదాల్లో ఉన్న భూములు, అటవీ భూములు, వక్ఫ్ భూములు ఇలా అన్నీ కలిపి 15 లక్షల ఎకరాల వరకు భూములు వివాదాల్లో ఉన్నట్లు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది.

భూ వివాదాలలో రాష్ట్ర వ్యాప్తంగా 15లక్షల ఎకరాలు.. లెక్క ఇదే
మొత్తం భూ వివాదాలలో ఉన్న 15లక్షల ఎకరాలలో 1,11,258 కేసులు సివిల్ కోర్టు లో ఉండగా, 41 ,961 ఎకరాలకు సంబంధించిన భూ వివాదాలు రెవెన్యూ కోర్టుల్లో ఉన్నాయి. ఇక రెవెన్యూ శాఖకు అటవీశాఖకు మధ్య సరిహద్దు వివాదాలు 2,18,980 ఎకరాల విస్తీర్ణం పై ఉన్నాయి. వీటితో పాటు దేవాదాయ, వక్ఫ్ , ఇంటి స్థలాలకు సంబంధించిన భూములు 3,98,295 ఎకరాల వరకు వివాదాల్లో ఉన్నాయి. 2,74,675 ఎకరాల భూములు కుటుంబ, రద్దు బదల్ వివాదాలలో ఉన్నాయి.

రోజువారీ కేసుల విచారణ చేయనున్న ట్రిబ్యునల్స్ .. కేసీఆర్ నిర్ణయంతో రెవెన్యూ ప్రక్షాళన
భూ బదలాయింపు నిషేధ భూములు 95,214 ఎకరాలు ఉండగా, ఎటూ తేలకుండా పార్ట్ బిలో చేర్చిన మరో 9 లక్షల ఎకరాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో రెవిన్యూ కేసుల విచారణ రెవిన్యూ కోర్టులలో వారానికొకసారి జరుగుతుండేవి. రెవెన్యూ కేసుల పరిష్కారానికి ప్రతిరోజు ల్యాండ్ కేసులను విచారించేందుకు వీలుగా ట్రిబ్యునల్స్ ను ఏర్పాటు చేయాల్సిందిగా నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల మేరకే రెవెన్యూ వ్యవస్థలో భారీ సంస్కరణలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications