హత్యాచార నిందితుడిపై ఆర్పీ పట్నాయక్ తనవంతు రివార్డు-ఇప్పటికీ దొరకని రాజు ఆచూకీ-ఏమై ఉంటాడు?
హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసి పరారైన నిందితుడు పల్లంకొండ రాజు కోసం పోలీసులు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఘటన జరిగిన దాదాపు వారం రోజులు కావొస్తున్నా నిందితుడు పట్టుబడకపోవడం గమనార్హం. ప్రస్తుతం 10 ప్రత్యేక పోలీస్ బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. ఇప్పటివరకూ అతని ఆచూకీపై ఎలాంటి క్లూ పోలీసులకు లభించలేదు. ఈ నేపథ్యంలోనే రాజు ఆచూకీ తెలియజెప్పేవారికి రూ.10లక్షలు ఇస్తామని రివార్డు ప్రకటించారు.తాజాగా టాలీవుడ్ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ సైతం నిందితుడిపై రివార్డు ప్రకటించారు.
నిందితుడిపై ఆర్పీ పట్నాయక్ రివార్డు
'చిట్టితల్లి కి న్యాయం జరగాలంటే, ఆమె ఆత్మ శాంతించాలంటే, ఈ పల్లకొండ రాజు దొరకాలి. హైదాబాద్ సిటీ పోలీస్ విడుదల చేసిన ఆధారాల ద్వారా నిందితుడిని పట్టుకున్న వారికి రూ.10 లక్షలు రివార్డ్ ప్రకటించారు.నా వంతుగా ఆ పట్టించిన వారికి రూ.50,000 ఇస్తాను.అతను దొరకాలి.... పోలీసులు ఇచ్చిన అన్ని క్లూస్ మనకి హెల్ప్ కావొచ్చు, కాకపోవచ్చు కానీ చేతిపై 'మౌనిక' అనే పచ్చబొట్టు తప్పకుండా అతన్ని పట్టించేలా చేస్తుంది. అతను మీ దగ్గర్లోనే ఉండొచ్చు. ఒక కన్ను వేసి ఉంచండి. పోలీస్ శాఖకి ఈ నెరస్తుడిని పట్టుకునే పనిలో మనం కూడా సహకరిద్దాం.' అంటూ ఆర్పీ పట్నాయక్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.సామాజిక అంశాలపై స్పందించడంలో ఆర్పీ పట్నాయక్ ఎప్పుడూ ముందుంటారు. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకుంటుంటారు.

ఇంతవరకూ దొరకని ఆచూకీ...
ఎన్నో క్లిష్టమైన కేసులను సైతం సునాయాసంగా డీల్ చేసి దేశంలోనే నంబర్.1 పోలీసింగ్ వ్యవస్థగా తెలంగాణ పోలీసులు పేరు తెచ్చుకున్నారు. అంతటి పేరున్న పోలీసులకు సైతం ఈ నిందితుడు చిక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే వాట్సాప్,ఫేస్‌బుక్,ఇతర సోషల్ మీడియా,టీవీలు,పత్రికల ద్వారా నిందితుడి ఫోటోలు జనంలోకి వెళ్లాయి. ప్రతీ చోటా దీని గురించే చర్చ జరుగుతోంది. నిందితుడు కనిపిస్తే పట్టివ్వడానికి జనం సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంతవరకూ రాజు ఆచూకీ దొరక్కపోవడం విస్మయానికి గురిచేస్తోంది.

రాజు ఆచూకీపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు...
రాజు ఆచూకీ దొరక్కపోవడం పట్ల సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. బహుశా అతను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని కొందరు అంటుంటే... ఈపాటికే ఎన్‌కౌంటర్ అయిపోయి ఉంటాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. నిందితుడిని పోలీసులు పట్టుకున్నారని తొలుత ప్రకటించిన మంత్రి కేటీఆర్... ఆ తర్వాత పొరపాటు జరిగిందని... నిందితుడి కోసం ఇంకా వెతుకుతున్నారని స్టేట్‌మెంట్ ఇవ్వడం పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని బాధిత కుటుంబంతో పాటు మెజారిటీ ప్రజలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్‌కౌంటర్‌లో ఎక్స్‌ట్రా జ్యుడీషియరీ కిల్లింగ్స్ కిందకు వస్తాయనే విషయం మరువరాదు. ఇలాంటి కేసుల్లో విచారణ జరిగితే నిందితుడికి ఎలాగు ఉరిశిక్ష పడుతుంది. కానీ ప్రజల భావోద్వేగాలను సంతృప్తి పరిచేందుకు ప్రభుత్వం మెజారిటీ ప్రజల డిమాండు మేరకు ఎన్‌కౌంటర్ అస్త్రాన్ని ప్రయోగించవచ్చుననే వాదన వినిపిస్తోంది.

ఎన్‌కౌంటర్ పరిష్కారమా...
హత్యాచార ఘటనలు జరిగినప్పుడు ఎన్‌కౌంటర్స్ చేయడం... ఆ తర్వాత కొన్నాళ్లకు మరో ఘటన తెరపైకి రావడం కామన్ అయిపోయింది. ఎన్‌కౌంటర్లకు బదులు సమస్య మూలాల్లోకి వెళ్లి దాని పరిష్కారం వెతకాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా విద్య,ఆడపిల్లలకు గుడ్ టచ్,బ్యాడ్ టచ్ వంటి వాటి పట్ల అవగాహన ఏర్పరచడం ముఖ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అప్పుడే నేరాలు తగ్గుతాయని... అలా కాకుండా ప్రజల భావోద్వేగాలను ప్రాతిపదికగా చేసుకుని శిక్షలు అమలుచేస్తే సమస్య పూర్తిగా సమసిపోదని అంటున్నారు.
హైదరాబాద్ పోలీసులు రూ.10లక్షల రివార్డు...
అత్యాచార నిందితుడి ఆచూకీ తెలియజెప్పినవారికి రూ.10లక్షలు రివార్డుగా అందజేస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిందితుడు రాజు ఆనవాళ్లను సీపీ అంజనీకుమార్ విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ తెలిపినవారి వివరాలను చాలా గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. సుదీర్ఘ చర్చల అనంతరం తాము రివార్డు ప్రకటిస్తున్నామన్నారు. నిందితుడు రాజు వయస్సు సుమారు 30 ఏళ్లు ఉంటుందని... అలాగే ఎ్తతు... సుమారు 5.9 అడుగులు ఉంటాడని చెప్పారు. నిందితుడి చేతులపై మౌనిక అనే టాటూ కూడా ఉంటుందన్నారు. ఆచూకీ తెలిసిన వారు 9490616366 మరియు 9490616627 అనే ఫోన్ నంబర్ల కు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ సీపీ తెలిపారు.

ఇప్పటికీ స్పందించని కేసీఆర్...
ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు బాధిత చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీ నుంచి మంచు మనోజ్ ఒక్కరే ఇప్పటివరకూ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియా తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీడియాలో చిన్నారి హత్యాచార ఘటనకు కవరేజ్ లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేపదే హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్ యాక్సిడెంట్‌పై వార్తలు ప్రసారం చేసే మీడియా చిన్నారి హత్యాచార ఘటనను ఎందుకు చూపించదని అన్నారు.ముందు మీడియా మారాలని సూచించారు. ఇవాళ వైఎస్సాఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మరోవైపు సీఎం కేసీఆర్ మాత్రం ఇప్పటివరకూ ఈ ఘటనపై స్పందించకపోవడం గమనార్హం.

ఇలా వెలుగులోకి...
హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి గత గురువారం (సెప్టెంబర్ 9) హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే.స్థానికంగా ఉండే రాజు (30) అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆరోజు సాయంత్రం 5 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. రాత్రయినా ఆచూకీ తెలియకపోవడంతో ఆ ప్రాంతంలో జులాయిగా తిరిగే రాజుపై అనుమానం వచ్చింది. నల్గొండ జిల్లా చందంపేట్ మండలం నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న రాజు చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. దీంతో అతడు పాపను ఏమైనా చేశాడేమోనన్న అనుమానంతో అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది. సాయంత్రం వరకూ చిరు నవ్వులతో ఆడుకుంటూ కనిపించిన తమ బిడ్డ ఓ దుర్మార్గుడి దాష్టికానికి బలైపోవడం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇప్పటికే పోలీసులు క్లూస్ టీమ్ పలు వివరాలు సేకరించారు.












Click it and Unblock the Notifications