90వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏవో: లంచం కోసం వాట్సాప్ గ్రూప్ కూడా!
ఖమ్మం: మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. తనిఖీలు చేయకుండా ఉండాలంటే తనకు లంచం ఇవ్వాలంటూ ఎరువులు, పురుగుల మందుల దుకాణాదారులతో బేరసారాలకు దిగాడు ఈ లంచావతారి. అంతేగాక, లంచాలకు సోషల్ మీడియాను కూడా సమర్థవంతంగా వినియోగించుకున్నాడు. చివరకు రూ. 90వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కాడు.

నెలవారీగా లంచం ఇవ్వాలంటూ ఏవో డిమాండ్..
ఏసీబీ డీఎస్పీ ఎస్వీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో నార్లపాటి మహేశ్ చందర్ ఛటర్జీ ఎనిమిదేళ్లుగా మండల వ్యవసాయాధికారి(ఏవో)గా పని చేస్తున్నారు. తనిఖీలు చేయకుండా ఉండేందుకు నెలవారీగా ఇచ్చే లంచం సొమ్ము ఇవ్వాలంటూ మండలంలోని ఎరువులు, పురుగుల మందుల దుకాణాల యాజమానులను డిమాండ్ చేశాడు.

లంచం కోసం ఓ వాట్సాప్ గ్రూప్ కూడా..
అంతేగాక, ఇందు కోసం ఓ వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాడు. ఈ నెలలో దుకాణానికి రూ. 15 వేలు ఇవ్వాలంటూ సందేశాలు పంపాడు. ఈ విషయమై చంద్రుగొండలోని ఆరు దుకాణాల యజమానులు మచ్చా కుమార్, గోదా సత్యం, ఎర్రం సీతారాములు, ముకేశ్, వెంకట్రామయ్య, చందర్ రావు జులై 30న ఏసీబీసి ఫిర్యాదు చేశారు.

రూ. 90వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏవో..
ఆ తర్వాత ఆరు దుకాణాల నుంచి నగదు సేకరించినవారు ఆ సొమ్ము తీసుకోవడానికి రావాలంటూ ఏవోను కోరారు. ఈ మేరకు చంద్రుగొండ రైతు వేదికలో సోమవారం సత్యం, సీతారాములు నుంచి ఏవో రూ. 90 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదే సమయంలో అశ్వారావుపేటలోని ఆయన స్వగృహంలో ఏసీబీ సీఐ రఘుబాబు ఆధ్వర్యంలో సోదాలు చేశారు. వ్వయసాయ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని, చట్ట ప్రకారం అధికారి మహేశ్ చందర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
Recommended Video

ప్రభుత్వ సబ్సిడీలు దుర్వినియోగంతో..
కాగా, ఎనిమిదేళ్లుగా చంద్రుగొండ మండలంలో పనిచేస్తున్న మహేశ్ చందర్ ఇటీవల మండల కేంద్రంలో ఎరువులు, పురుగుల మందు దుకాణం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. నేరుగా వ్యాపారం చేస్తే ఇబ్బందులు వస్తాయని భావించి, మరో ఇద్దరితో కలిసి వ్యాపారం సాగిస్తున్నారు. ప్రభుత్వం రాయితీపై ఇచ్చే అన్ని రకాల వస్తువులను అక్కడ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. ఓ వైపు లంచాలు తీసుకుంటూనే.. మరో వైపు ఎరువుల వ్యాపారం చేయడంతో మిగితా ఎరువుల వ్యాపారులు ఏసీబీకి పట్టిచ్చినట్లుగా తెలుస్తోంది.