మంత్రి కేటీఆర్ సమక్షంలో నేడు సాయి చంద్ భార్య రజినికి కీలక బాధ్యతలు!!
తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నూతన చైర్మన్ గా ఇటీవల మరణించిన సాయిచంద్ సతీమణి రజిని సాయిచంద్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్యాలయంలో సాయి చంద్ సతీమణి రజిని బాధ్యతలు స్వీకరించనున్నారు.
రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, మరియు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో నూతన చైర్మన్ గా రజినీ సాయి చంద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న సాయి చంద్ గుండెపోటుతో మరణించడంతో ఆయన సతీమణి రజినిని గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా నియమిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధనలో అలు పెరుగని పోరాటం చేసిన సాయి చంద్ గుండెపోటుతో ఇటీవల మరణించడంతో, గిడ్డంగులసంస్థ చైర్ పర్సన్ గా ఉన్న భర్త స్థానంలో భార్య రజినీకి అవకాశం కల్పిస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు.
ఉద్యమకారుల కుటుంబాలను ఆదరించడంలో సీఎం కేసీఆర్ గొప్ప ఔదార్యం చూపిస్తారని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సాయి చంద్ మరణంతో కన్నీరు మున్నీరుగా రోదిస్తున్న రజినీ తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలయ్యారు. భర్త మరణం ఆమె తీవ్రంగా కుంగదీసింది.
దీంతో ఆమెను ఎలాగైనా ఆ దుఃఖం నుండి బయటకు తీసుకురావడం కోసం, అలాగే గుండెపోటుతో హఠాత్తుగా మరణించిన సాయి చంద్ కు తగిన గౌరవం ఇవ్వటం కోసం తీసుకున్న ఈ నిర్ణయం సాయిచంద్ సతీమణి రజినీకి గొప్ప అండగా ఉంటుందని, ఆమెలో బాధ్యతను పెంచుతుందని భావిస్తున్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పోరేషన్ చైర్మన్ గా సాయి చంద్ సతీమణి రజిని ప్రజలకు, రైతులకు ఉపయోగపడేలా పని చెయ్యాలని చాలామంది కోరుతున్నారు.












Click it and Unblock the Notifications