సజ్జనార్ ఫొటోతో సైబర్ మోసాలు.. హైదరాబాద్ సీపీ కీలక ఆదేశాలు
నగరంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అమాయకులను బురిడీ కొట్టించేందుకు రకరకాల ఎత్తులతో సైబరాసురులు ప్లాన్లు వేస్తున్నారు. కొంచెం అజాగ్రత్తతో ఉన్నా ఖజానా ఖాళీ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలే వేదికగా సైబర్ నేరగాళ్లు తమ దందా నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్ లో మాయమాటలు చెప్పి బుట్టలో పడేస్తున్నారు. ఆ తర్వాత వారి బ్యాంక్ ఖాతా నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు.
కొందరు స్టాక్ మార్కెట్స్ లో పెట్టుబడులు పెడితే లక్షలు లాభం వస్తుందని నమ్మిస్తారు. ఇలా ఇటీవలి కాలంలో భారీగా సైబర్ మోసాలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది తొలి 8 నెలల్లోనే ఏకంగా రూ.372 కోట్లు సైబర్ నేరగాళ్లు స్వాహా చేసినట్లు పోలీసులు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయం పెంచుకోవడం.. అలాగే ఆన్ లైన్ లో పలు ప్రకటనలతో ప్రజల్ని మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అయితే తాజాగా సైబర్ నేరగాళ్లు మరింత హద్దు మీరారు. ఏకంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఫోటో పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇదే విషయంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా పోస్టు పెట్టారు. అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. "జాగ్రత్త! ముఖం చూసి మోసపోవద్దు. వాట్సాప్ లో డీపీగా నా ఫోటోను పెట్టుకుని తెలిసిన వాళ్లకు సందేశాలు పంపిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇవి నకిలీ ఖాతాలు. ఇవి పూర్తిగా మోసపూరితమైనవి.
ఇలాంటి సందేశాలకు స్పందించకండి. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. సైబర్ నేరగాళ్లకు మీ వ్యక్తిగత వివరాలను అసలే ఇవ్వొద్దు. డబ్బులు అడిగితే పంపించొద్దు. సైబర్ మోసగాళ్లకు మీ జాగ్రత్తే అడ్డుకట్టనే విషయం మరచిపోవద్దు. నకిలీ వాట్సాప్ ఖాతాలు మీ దృష్టికి వస్తే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేసి సమాచారం ఇవ్వండి. అలాగే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి" అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

ఇలా ప్రముఖుల ముఖాలు చూసి మోసపోవద్దని మనం అప్రమత్తంగా లేకపోతే సైబర్ నేరగాళ్లు ఎంతకైనా తెగిస్తారని సీపీ స్పష్టం చేశారు. ఫేక్ వాట్సప్ ఖాతాల గురించి 1930 కు ఫోన్ చేసి వేగంగా సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సజ్జనార్ పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల సోషల్ మీడియా ఛానళ్లకు సజ్జనార్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చిన్నారులను బలిపెట్టవద్దని వ్యాఖ్యానించారు. పిల్లలతో అనుచిత కంటెంట్ చేయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే కొన్ని యూట్యూబ్ ఛానెళ్లను సైతం బ్యాన్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వీడియోలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. హెల్ప్ లైన్ నంబర్ 1930కు గానీ, cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సూచనలు చేశారు.












Click it and Unblock the Notifications