మరిన్ని నిజాలు: పిల్లల పాల కోసం తాళిని కూడా అమ్మిన సారిక
వరంగల్: మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు తన న్యాయవాది రెహానాకు పంపిన ఈ-మెయిల్‌లో హృదయాన్ని కదిలించే మరిన్ని విషయాలను ప్రస్తావించింది. చిన్న పిల్లలకు పాల డబ్బాలు కొనేందుకు డబ్బుల్లేక తాను నానా ఇబ్బందులు పడినట్లు తెలిపింది.. చివరికి తన తాళిబొట్టును అమ్మి పాల డబ్బాలు కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో పుట్టింటివారితో మాట్లాడేందుకు యత్నించగా, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేవారని సారిక తన ఆవేదనను వ్యక్తం చేసింది.
రెండోసారి గర్భం దాల్చిన సమయంలో సారికకు అనిల్ కనీసం వైద్య పరీక్షలు కూడా చేయించలేదని తెలిపింది. రెండో కాన్పులో కవలలకు జన్మనిచ్చిన సారిక తీవ్ర అనారోగ్య సమస్యలకు గురైనా అనిల్ పట్టించుకోలేదని, పిల్లలు పెరుగుతున్నకొద్దీ బాధ్యతల్ని అనిల్ పూర్తిగా విస్మరించాడని చెప్పింది. కనీసం తినేందుకు సరిపడ డబ్బులు, సరుకులు కూడా కొనివ్వలేదని సారిక ఆ లేఖలో తెలిపింది.
Photos: రాజయ్య కోడలు మృతి

ఇలాంటి పరిస్థితుల్లో పుట్టింటికి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ చేసేవారని సారిక ఆవేదనను వ్యక్తం చేసింది. ఒకవేళ పుట్టింటి ఆదరణ లభించివుంటే సారికకు ఈ పరిస్థితి ఏర్పడి వుండేది కాదేమోనన్న చర్చ సాగుతోంది. సారిక తండ్రి మంచాన పడటం, తల్లి అనారోగ్యంతో బాధపడటంతో సారికకు అండగా నిలవలేకపోయారని అంటున్నారు.
ప్రేమ పెళ్లి చేసుకోవడం వాళ్లకు ఇష్టం లేకపోవడంతో పాటు సారిక జీవితం ఇలా తయారైందన్న బాధతోనే ఆమె తండ్రి మంచం పట్టారని స్థానికులు అంటున్నారు. అత్తగారింట్లో వేధింపులు ప్రాణాలు కోల్పోయే స్థాయికి తెస్తాయని తెలిసి కూడా సారిక భర్త ఇంట్లోనే ఉండి పోరాటం చేసిందని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఇది హత్యేనని అనిల్ కుటుంబీకులకు తగిన శిక్ష పడాల్సిందేనని మహిళా సంఘాలతో పాటు సారిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications