మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సావిత్రి బాయి పూలే జయంతి జనవరి 3వ తేదీని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా డిక్లేర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ప్రతి ఏడాది జనవరి 3వ తేదీన మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖకు సూచించారు. ఈ వేడుకలకు విద్యాశాఖ నుంచి బడ్జెట్ కేటాయించాలని స్పష్టం చేశారు.
ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు.

విద్యతోనే వనితకు విముక్తి సాధ్యమన్న సామాజిక సంస్కర్త, ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, బహుజన చైతన్య స్ఫూర్తి మహాత్మ జ్యోతిరావుపూలే సతీమణి సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని నిర్ణయించామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. కాగా, సావిత్రిబాయి పూలే ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
భారత సమాజంలో చారిత్రాత్మక మార్పునకు సావిత్రిబాయి పూలే పునాది వేశారన్నారు. మహిళల విద్యకు ప్రాధాన్యం కల్పించి, అణిచివేయబడిన వర్గాలకు న్యాయం అందించేందుకు తమ జీవితాన్ని అర్పించారని కొనియాడారు. లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. సావిత్రిబాయి ఆశయాలను సాధించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని సీఎం రేవంత్ చెప్పారు.
మహిళల సాధికారత, ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాల వృద్ధికి ప్రజా ప్రభుత్వం ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిందని సీఎం తెలిపారు. బీసీలు, బడుగు, బలహీన వర్గాల సామాజిక, రాజకీయ అభ్యున్నతికి రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి సర్వేను ఇటీవల పూర్తి చేసిందని గుర్తు చేశారు. మహిళలను అక్షరాస్యులను చేయడానికి సావిత్రిబాయి పూలె ఎంతో శ్రమించారని, ఆమె త్యాగాన్ని, కృషికి గుర్తింపుగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళ టీచర్లు సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఘనంగా నిర్వహించుకోవాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications