ఉపరితల ద్రోణి.. ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలో వాతావరణ పరిస్థితుల్లో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు వచ్చే కొన్ని గంటల్లో అకస్మాత్తుగా ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడొచ్చని, గాలిలో తేమ శాతం పెరిగి ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది,
తాజా వాతావరణ అంచనాల ప్రకారం.. నేడు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, దక్షిణ కోస్తా తీరంలోని ప్రకాశం, నెల్లూరుతో పాటు మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే వీలుంది. రాయలసీమ పరిధిలోని పలు జిల్లాల్లో కూడా ఈ వాతావరణ ప్రభావం ఉంటుంది. ఆకాశం మేఘావృతమౌతుంది.

మిగిలిన 20 జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది. అకస్మాత్తుగా వర్షం కురిసే తరుణంలో పిడుగుల ముప్పు అత్యంత తీవ్రంగా పొంచి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాలలో పనులు చేసే వాళ్లు జాగ్రత్తగా వ్యవహరించాలని, ముఖ్యంగా పొలం పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ అనుబంధ పనుల కూలీలు, పశువుల కాపరులు వర్షం పడుతున్నప్పుడు లేదా మేఘాలు గర్జిస్తున్నప్పుడు వృక్షాల కింద గానీ, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో గానీ ఆశ్రయం పొందకూడదని సూచించింది.
తడి నేలపై నడుస్తున్నప్పుడు లేదా తడి గడ్డిపై నిలబడినప్పుడు విద్యుత్ ప్రవాహం వేగంగా జరిగే ప్రమాదం ఉంది. ఈ రకమైన ప్రాణాంతక పరిస్థితుల నేపథ్యంలో ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో మొబైల్ ఫోన్లు వాడటం ఏమాత్రం క్షేమకరం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పశువులను కూడా బహిరంగ ప్రదేశాల్లో చెట్లకు కట్టేయకుండా సురక్షితమైన నిర్మిత షెడ్లలో భద్రపరచాలి. అలాగే ఉధృత ఈదురు గాలుల కారణంగా పాత ఇళ్లు, బలహీనమైన రేకుల షెడ్లు, రోడ్లపై ఉండే భారీ ప్రకటనల హోర్డింగ్‌ల కింద ఎవరూ నిలబడకూడదు.












Click it and Unblock the Notifications