జపాన్‌లో మళ్లీ భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు ???
జపాన్ దేశ ప్రజలకు వరుస భూకంపాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా ఈరోజు ( ఆదివారం, జూన్ 28 ) తెల్లవారుజామున జపాన్‌ను మరోసారి భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.1గా నమోదైనట్లు వాతావరణ సంస్థ (Japan Meteorological Agency - JMA) వెల్లడించింది. భూకంపం కారణంగా పలు ప్రాంతాల్లో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ప్రస్తుతం సునామీ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేయడంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు.
కాగా జపాన్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 5.21 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. భూకంప కేంద్రం అమోరి ప్రిఫెక్చర్ సమీపంలో భూమికి సుమారు 41 కిలోమీటర్ల లోతులో నమోదైనట్లు జేఎంఏ వెల్లడించింది. ప్రకంపనల ప్రభావం సమీప ప్రాంతాలతో పాటు మరికొన్ని నగరాల్లోనూ స్వల్పంగా కనిపించినట్లు సమాచారం. భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి పెద్దఎత్తున ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం వెలువడలేదు.

అయితే ప్రకంపనల ప్రభావంతో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. దాంతో కొండ ప్రాంతాలు, వాలుదారుల సమీపంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భవనాల్లో పగుళ్లు, రహదారుల పరిస్థితి, రైల్వే మార్గాలు, విద్యుత్ వ్యవస్థలను అధికారులు పరిశీలిస్తున్నారు. అవసరమైతే అత్యవసర సహాయక బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది.
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వరుసగా నమోదవుతున్న భూకంపాలు శాస్త్రవేత్తలను కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత నాలుగు నుంచి ఐదు రోజుల వ్యవధిలోనే ప్రపంచంలోని పలు దేశాల్లో దాదాపు పది భూకంపాలు సంభవించాయి. ముఖ్యంగా జూన్ 24న వెనెజువెలాలో 7.5, 7.2 తీవ్రతలతో వరుసగా సంభవించిన భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. వేలాది మంది నిరాశ్రయులవ్వగా, వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడించాయి. అదే రోజున జపాన్‌లో 6.9 తీవ్రతతో, అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో 5.6 తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి.
అంతేకాకుండా జూన్ 26న ఫిలిప్పీన్స్‌లో 6.5 తీవ్రతతో, జపాన్‌లో మరోసారి 5.7 తీవ్రతతో, నికరాగ్వాలో 5.2 తీవ్రతతో భూమి కంపించింది. జూన్ 27న పాకిస్తాన్‌లో 5.4 తీవ్రతతో ప్రకంపనలు నమోదవగా, జూన్ 28న ఆఫ్ఘనిస్తాన్‌లో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంప ప్రభావం భారత్‌లోని జమ్మూ కశ్మీర్, ఢిల్లీ ప్రాంతాల వరకు స్వల్పంగా కనిపించింది. ఇలా వరుసగా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు నమోదవుతుండటం భూగర్భ కదలికలపై చర్చకు దారితీస్తోంది.
ఇక జపాన్ ప్రపంచంలోనే అత్యంత ఆధునిక భూకంప హెచ్చరిక వ్యవస్థ కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. భూకంపం సంభవించిన కొన్ని సెకన్లలోనే మొబైల్ ఫోన్లు, టెలివిజన్, రేడియో, ప్రజా రవాణా వ్యవస్థల ద్వారా అత్యవసర హెచ్చరికలు పంపించే సాంకేతికత అక్కడ అమల్లో ఉంది. దీంతో ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకునే అవకాశం లభిస్తుంది. భూకంప నిరోధక నిర్మాణ ప్రమాణాలు కూడా కఠినంగా అమలు చేయడం వల్ల భారీ విపత్తులను చాలావరకు తగ్గించగలుగుతోంది.












Click it and Unblock the Notifications