స్వాతంత్ర్య దినోత్సవం వేళ తెలంగాణా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పై శుభవార్త!
స్వాతంత్ర్య దినోత్సవం వేళ తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ రాష్ట్రం నుండి ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని పూర్తిగా అందజేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం 2400కోట్ల రూపాయలు ముందుగానే బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అయిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
డబ్బులు నేరుగా విద్యార్థుల ఖాతాలలోనే
విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరిని అడగవలసిన అవసరం లేకుండా డబ్బులు నేరుగా వారి ఖాతాలలోనే పడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో హెచ్ఎండిఏ మైదానం సమీపంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను నిన్న సాయంత్రం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తో కలిసి ఆవిష్కరించారు.

చదువు ద్వారానే విద్యార్థుల జీవితాలు మారతాయన్న సీఎం
అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి 150 సంవత్సరాల క్రితమే విద్య యొక్క గొప్పతనాన్ని నిరూపించిన పూలే దంపతులు స్ఫూర్తిని అనుసరించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. చదువు ద్వారానే విద్యార్థుల జీవితాలు మారుతాయని, ఉన్నత విద్యను అభ్యసించిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు.
నైపుణ్యం ఉంటే విదేశాలకు పంపే బాధ్యత తమదే అన్న సీఎం
ఉద్యోగాల కోసం కేవలం డిగ్రీలు సరిపోవని, పోటీ పెరిగిన నేపథ్యంలో సాంకేతిక నైపుణ్యాలు అవసరమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. పదవ తరగతి తర్వాత ఐటిఐ లలో నైపుణ్యం సాధించవచ్చని, నర్సింగ్ విద్య ద్వారా కూడా జపాన్, జర్మనీ, కొరియా వంటి దేశాలలో మంచి ప్యాకేజీ తో ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం చెప్పారు. నైపుణ్యం ఉంటే ఇతర దేశాలకు పంపించే బాధ్యత తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు.
క్రీడల్లో రాణిస్తే నగదు బహుమతులు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం
చదువుతోపాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించి పతకాలు సాధిస్తే, నగదు బహుమతులు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇదే క్రమంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ అందించడానికి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం 2400 కోట్ల రూపాయలను ముందుగానే బ్యాంకు ఖాతాలో విద్యార్థుల కోసం సిద్ధంగా ఉంచుతామని వెల్లడించారు.
ఒకేసారి ఫీ రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామన్న సీఎం
విడతల వారీగా కాకుండా ఒకేసారి ఫీజు రియింబర్స్మెంట్ విడుదల చేస్తామని తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో విద్యార్థులు లేకపోయినా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి, వారికి భరోసా అందించడానికి, వారి విద్య ఉన్నతికి అన్ని విధాల చేదోడువాదోడుగా నిలుస్తుందన్నారు.













Click it and Unblock the Notifications