బండి సంజయ్ ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన విషయాలు; వరంగల్ సీపీ ప్రెస్‌మీట్ పై ఉత్కంఠ!!
తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారింది. పదవ తరగతి పేపర్ లీకేజీ వెనుక బిజెపి, బండి సంజయ్ ఉన్నారని పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా బి ఆర్ ఎస్ నాయకులు టార్గెట్ చేస్తున్నారు. నిన్న వరంగల్లో హిందీ పరీక్ష పత్రం పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికి వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొట్టడంతో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఒక మైనర్ తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
అందులో ఒకరు మాజీ విలేకరి అయిన బూరం ప్రశాంత్ గా గుర్తించారు. అయితే వాట్సప్ గ్రూపుల్లో ప్రశ్నాపత్రాన్ని చేరవేసిన బూరం ప్రశాంత్ బండి సంజయ్ వాట్సాప్ కు ప్రశ్నాపత్రాన్ని పంపించారు. అంతేకాదు చాలామంది బిజెపి నాయకులతో ఫోన్లో మాట్లాడారు. దీంతో బండి సంజయ్ ను ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇక టీఎస్ బిజెపి చీఫ్ బండి సంజయ్ పై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అనేక కీలక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తుంది. బండి సంజయ్ పై సి ఆర్ పి సి 154, 157 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల జాబితాలో బండి సంజయ్ పేరును పోలీసులు చేర్చారు. పేపర్ లీకేజీల వెనక బండి సంజయ్ కుట్ర ఉందని పోలీసులు అనుమానిస్తూ ఈ క్రమంలోనే బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు.
అంతేకాదు ఎగ్జామినేషన్ సెంటర్ల వద్ద ధర్నా చేయాలని బండి సంజయ్ కుట్ర పన్నారని అందులో ప్రస్తావించారు. ప్రశాంత్ తో కొంతకాలంగా టచ్ లో ఉన్న బండి సంజయ్, వాట్సాప్ లో సమాచారం వైరల్ కావడంతో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించారని పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే నిన్న అర్ధరాత్రి కరీంనగర్ లో బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ఈరోజు పాలకుర్తిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బండి సంజయ్ ను వరంగల్ కు తరలిస్తున్నారు.
దీంతో బండి సంజయ్ కి సంబంధించి పోలీసులు తదుపరి చర్యలు ఏం తీసుకుంటారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం మూడు గంటలకు బండి సంజయ్ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ సీపీ ప్రెస్ మీట్ ఉండటంతో ఆయన అరెస్ట్ పై సీపీ ఏం చెప్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications