మావోయిస్టులకు వరుస షాకులు: మరో భారీ ఎన్‌కౌంటర్; 8మంది మావోయిస్టులు హతం!!
మావోయిస్టులకు వరుస షాకులు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగి ఆరుగురు మావోయిస్టులు మృతిచెందగా, తాజాగా ఛత్తీస్ గడ్ భీకర ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతిచెందిన ఘటన మావోయిస్టు పార్టీకి ఊహించని షాక్ అని చెప్పాలి. ఒకవైపు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే ఛత్తీస్ గడ్ సరిహద్దు దండకారణ్యం భీకర తుపాకీ శబ్దాలతో దద్దరిల్లుతోంది.
బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్
బీజాపూర్ జిల్లాలోని కొర్చోలి అటవీ ప్రాంతంలో ఈరోజు పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. అనేక మంది మావోయిస్టులు ఈ ఘటనలో గాయపడినట్లు గా సమాచారం. బీజాపూర్ జిల్లాలోని లెండ్రా గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాగి ఉన్నట్టు సమాచారం రావడంతో మావోయిస్టుల ఏరివేతకు యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చేపట్టారు.

మావోలకు భారీ షాక్ .. ఎదురు కాల్పుల్లో వారు మృతి
ఇందులో భాగంగా డి ఆర్ జి బృందాలు, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సిఆర్పిఎఫ్, కోబ్రా కమాండ్ యూనిట్ బలగాలు దండకారణ్యంలో గాలింపు చేపట్టాయి. దీంతో మావోయిస్టులు కాల్పులు జరపగా, ఎదురు కాల్పులకు దిగిన పోలీసులు ఎనిమిది మందిని హతమార్చారు. మిగతావారు గాయాలపాలై అక్కడి నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తుంది. పరారైన వారి కోసం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది.
లోక్ సభ ఎన్నికలు దాడులకు స్కెచ్.. భద్రతా బలగాల ఆపరేషన్
సంఘటనా స్థలం నుంచి ఇన్సాన్, ఎల్ ఎం జి వంటి ఆటోమేటిక్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి జూన్ మధ్య మావోయిస్టులు ఈ ప్రాంతంలో వ్యూహాత్మక ఎదురుదాడి శిక్షణ కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఇక ఈ సంవత్సరం లోక్సభ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున దాడులు మావోయిస్టులు చేసే అవకాశం ఉందన్న సమాచారంతో ఆపరేషన్ చేపట్టారు.
యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ..41 మంది మావోయిస్టులు హతం
ఇప్పటివరకు ఇటీవల కాలంలో మావోయిస్టుల పైన చేపట్టిన యాంటీ నక్సల్ ఆపరేషన్ లో మొత్తం 41 మంది మావోయిస్టులు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఇక త్వరలో ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో మొదటి దశలోనే ఏప్రిల్ 19వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఎటువంటి మావోయిస్టులు కార్యకలాపాలకు పాల్పడకుండా అటవీ ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి.












Click it and Unblock the Notifications