ఆరుగురు మిత్రులతో కలిసి హత్యాకాండ: కమలాపురం జంటహత్యలు ఇలా..
జయశంకర్ జిల్లా మంగపేట మండలం కమలాపురంలో శనివారం అర్ధరాత్రి జరిగిన జంటహత్యల మిస్టరీ వీడింది.
ఏటూరునాగారం: జయశంకర్ జిల్లా మంగపేట మండలం కమలాపురంలో శనివారం అర్ధరాత్రి జరిగిన జంటహత్యల మిస్టరీ వీడింది. రౌడీషీటర్ నర్ర శ్రీనివాస్, జరుపుల కల్యాణ్ హత్యకు కారణమైన ఏడుగురు నిందితులను ఏటూరునాగారం ఏఎస్పీ రాహుల్‌హెగ్దే మంగళవారం మీడియా ఎదుట హాజరుపర్చారు. సంఘటనకు దారితీసిన పరిస్థితులను వివరించారు.
ఓ యువతిపై అత్యాచారయత్నం చేసిన సంఘటనలో మంగపేట పోలీస్‌స్టేషన్‌లో తమపై కేసు నమోదు కావడానికి ఆమె బంధువు భూక్య రాజు అనే వ్యక్తి కారణమని భావించిన శ్రీనివాస్, కల్యాణ్ అతన్ని హతమార్చేందుకు నిర్ణయించుకున్నారు. కమలాపురంలోని ఓ మద్యం దుకాణంలో వారిరువురు మాట్లాడుకుంటుండగా విన్న భూక్య రాజు స్నేహితులు వెంటనే సమాచారం అతనికి చేరవేశారు.
ఈ క్రమంలో శ్రీనివాస్, కల్యాణ్‌లను మట్టుబెట్టాలని పథకం పన్నిన రాజు.. తన స్నేహితులు భూక్య రవి, భూక్య లచ్చు, భూక్య రాము, గగులోత్ రాజు, గుగులోతు శ్రీకాంత్, భూక్య దేవేందర్ సహాయం కోరాడు. మద్యం మత్తులో ఇంటికి వెళ్తున్న శ్రీనివాస్, కల్యాణ్‌లు భూక్య రాజు ఇంటివద్దకు రాగానే వారిని బలవంతంగా లోపలికి తీసుకువెళ్లి తాళ్లతో బంధించారు. కళ్లల్లో కారంచల్లి ఇనుపరాడ్లు, కత్తులతో దాడిచేసి హత్య చేశారు.

మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి ఏడుగురు నిందితులను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు. కాగా, నర్రా శ్రీనివాస్‌పై మంగపేట పోలీస్‌స్టేషన్‌లో 8, వివిధ ప్రాంతాల్లో మరో 22 కేసులు నమోదైనట్లు ఏఎస్పీ చెప్పారు. సమావేశంలో ఏటూరునాగారం సీఐ డి. రఘుచందర్, మంగపేట ఎస్‌ఐ మహేందర్ యాదవ్, ఏటూరునాగారం ఎస్‌ఐ సట్ల కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
శోకం.. పుత్రోత్సాహం
కమలాపురం: విధి ఆడిన వింత నాటకంలో ఆ మాతృమూర్తి శోకంతో కుమిలిపోతుండగా.. పండింటి బిడ్డకు జన్మనివ్వటం పుత్రోత్సాహాన్ని నింపింది. మంగపేట మండలం కమలాపురంలో శనివారం రాత్రి నర్రా శ్రీను, కల్యాణ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీను భార్య స్వప్న మంగళవారం మగబిడ్డకు జన్మినిచ్చింది.
అయితే భర్త హత్యకు గురైనట్లు ఆమెకు ఇంకా తెలియదు. ఆదివారం ఉదయం శ్రీనుకు గాయాలైనట్లు కుటుంబసభ్యులు ఆమెకు చెప్పడంతో బీపీ పెరిగింది. ఈ క్రమంలోనే స్వప్నకు పురి నొప్పులు రావడంతో ఏటూరునాగారంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త మృతిచెందినట్లు ఆమెకు తెలిస్తే ప్రమాదమని ఊహించిన వైద్యులు వెంటనే హన్మకొండలోని మిషన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్వప్న పండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది.












Click it and Unblock the Notifications