రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య 'షాడో మంత్రి' విభేదాలు?
కాంగ్రెస్ పార్టీ అన్న తర్వాత పంచాయితీలు లేకపోతే ఆశ్చర్యపోవాలికానీ పంచాయితీలుంటే అది సాధారణ విషయమే. టెక్నాలజీ అత్యంత వేగంగా మార్పును సంతరించుకుంటోంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం పాత చింతకాయ పచ్చడి తరహాలోనే ఉంటోంది. ఏ రాష్ట్రంలోను, ఏ మంత్రివర్గంలోను విభేదాలు ఉండటంలేదు. ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ తెలంగాణలో మాత్రం అలా జరగడంలేదు. మొన్నటి వరకు ఎమ్మెల్యే కోటమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
20 శాతం వేతనాలు అదనంగా ఇస్తేనే
విరుచుకు పడీపడీ ఆయన అలసిపోయారేమో ఆయన స్థానంలోని ఆయన సోదరుడు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చారు. రేవంత్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత సినీ కార్మికులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలోనే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. టికెట్లు పెంచుకోవడానికి అనుమతిస్తాం కానీ కాకపోతే కార్మికులకు 20 శాతం అదనపు వేతనాలు చెల్లించాలనే మెలిక పెట్టారు. అలా అయితేనే కొత్త సినిమాలు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతిస్తానని తేల్చిచెప్పారు. తర్వాత సినీ కార్మికులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సన్మానించాయి.

ఓ షాడో మంత్రి గ్యాప్ పెంచుతున్నారు
రేవంత్ మాట్లాడిన 20 శాతం మాటలు వైరల్ కావడంతోపాటు ఆయనకు విపరీతమైన పాజిటివ్ ను తీసుకొచ్చింది. మీడియాలో ప్రముఖంగా ప్రసారమయ్యాయి. అయితే తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ సమయంలో అక్కడ లేరు. ముంబయిలో ఉన్నారు. తాను లేకుండా సినీ కార్మికులతో సమావేశం నిర్వహించడం సరైన చర్య కాదని మంత్రి తన సన్నిహితులతో అన్నట్లుగా తెలుస్తోంది.
అంతేకాకుండా తనకు, రేవంత్ రెడ్డికి ఓ షాడో మంత్రి గ్యాప్ పెంచుతున్నారని చెప్పినట్లు సమాచారం. ఆ షాడో మంత్రి ఎమ్మెల్యే కాదు.. ఎమ్మెల్సీ కాదు.. రాజ్యసభ సభ్యత్వం ఇవ్వలేదు.. అయితే ఓ క్యాబినెట్ ర్యాంకు పదవిస్తే ఆయన పెత్తనం రోజురోజుకు పెరిగిపోతోందని వాపోయినట్లు తెలుస్తోంది. సినీ కార్మికులతో సమావేశం నిర్వహించినప్పుడు ఆ షాడో మంత్రి అక్కడే ఉన్నారని, ఈ విషయానికి సంబంధించి కాంగ్రెస్ నాయకుల మధ్య అంతర్గతంగా చర్చ నడుస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications