హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాల్సిన షార్జా ఇండిగో ఫ్లైట్ పాకిస్తాన్‌లో ల్యాండ్
హైదరాబాద్: దేశీయ పౌర విమాన సర్వీసుల్లో సాంకేతిక లోపాలకు అడ్డుకట్డ పడట్లేదు. వరసగా చోటు చేసుకుంటోన్న సాంకేతిక లోపాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తోన్నాయి. 18 రోజుల వ్యవధిలో ఎనిమిదిసార్లు స్పైస్‌జెట్ సంస్థకు చెందిన విమానాల్లో ప్రమాదకరంగా లోపాలు తలెత్తాయి. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవీయేషన్ విచారణకు ఆదేశించింది కూడా. ఆ తరువాత కూడా వీటికి బ్రేకులు పడట్లేదు. బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన విస్తారా విమానం సింగిల్ ఇంజిన్‌తో ప్రయాణించింది.
ఈ నెల 5వ తేదీన ఢిల్లీ నుంచి దుబాయ్‌కు బయలుదేరి వెళ్లిన స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో.. దాన్ని పాకిస్తాన్‌లోని కరాచీలో అత్యసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. షార్జా నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానం అదే కరాచీలో దిగింది. సాంకేతిక లోపాలు తలెత్తడమే దీనికి కారణం.

షార్జా నుంచి బయలుదేరిన ఈ విమానం షెడ్యూల్ ప్రకారం.. హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. మార్గమధ్యలో విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీన్ని పైలెట్ సకాలంలో గుర్తించగలిగారు. సమీప విమానాశ్రయం కరాచీ ఒక్కటే కావడంతో అప్పటికప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు.
దీనిపై పాకిస్తాన్ పౌర విమానయాన శాఖ అధికారులకు సానుకూలంగా స్పందించారు. దీనితో పైలెట్ విమానాన్ని కరాచీ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. విమానంలో తలెత్తిన లోపాలేమిటనేది అక్కడి అధికారులు పరిశీలిస్తోన్నారు. కాగా- కొద్దిరోజుల తేడాతో భారత్ నుంచి బయలుదేరిన, చేరుకోవాల్సిన విమానాలు కరాచీ విమానాశ్రయంలో దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.