సీరియల్ కిల్లర్ : 16 మంది మహిళల హత్య, పోలీసులకే షాక్..
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ సమీపంలో ఇటీవల ఓ మహిళ హత్యకు గురైంది. ఆ హత్యపై విచారణ చేపట్టిన పోలీసులు శ్రీను అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు తెలిశాయి. శ్రీను గతంలో 16 మంది మహిళలను హత్య చేసినట్టు పోలీసులు నిర్దారించారు. మహిళల మెడలోని బంగారం కోసమే ఇన్ని హత్యలకు పాల్పడినట్టు గుర్తించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోనే గాక శంషాబాద్,షాద్‌నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పలువురు మహిళలను శ్రీను హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు.

ఇలా వెలుగులోకి :
ఈ నెల 16న శ్రీను మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో ఉన్న ఓ కల్లు కాంపౌండ్ వద్దకు వెళ్లాడు. నవాబుపేట మండలం కూచూర్‌కి చెందిన అలివేలమ్మతో అక్కడ మాటలు కలిపాడు. ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు తెలుసుకున్నాడు. దేవరకద్రలో ఓ వ్యక్తి తనకు డబ్బులు ఇచ్చేది ఉందని, తనతో వస్తే రూ.4వేలు ఇస్తానని ఆశ పెట్టాడు. శ్రీను మాటలు నమ్మి అలివేలమ్మ అతని బైక్‌పై బయలుదేరింది. అయితే మార్గమధ్యలో డోకూర్ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో బైక్ ఆపిన శ్రీను.. ఆమెపై దాడి చేశాడు.
తలపై బలంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై బంగారంతో ఉడాయించాడు. కేసు విచారణ సందర్భంగా పోలీసులు శ్రీనుపై అనుమానంతో అదుపులోకి తీసుకోగా నేరం అంగీకరించాడు. దాంతో పాటు దాదాపు మరో 16మందిని హతమార్చినట్టు పోలీసుల విచారణలో తేలింది.

ముందు నుంచి నేర ప్రవృత్తి..
2007లో తన సొంత తమ్ముడిని హత్య చేసిన కేసులో శ్రీను జైలుకి వెళ్లాడు. అయితే పరివర్తన కింద అప్పీల్ చేసుకోవడంతో.. మూడేళ్లకే బయటకొచ్చాడు. ఆ తర్వాత కూడా పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. జైలు నుంచి బయటకొచ్చాక.. ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తూ హత్యలు చేశాడు. అలా 2018లో జైలు నుంచి బయటకొచ్చాక దేవరకద్ర,కొత్తకోట,మిడ్జిల్,భూత్పూర్ గ్రామాల పరిధిలో నలుగురు మహిళలను హత్య చేశాడు. శ్రీనుపై ఇప్పటివరకు 18 కేసులు నమోదు కాగా.. అందులో 17 హత్య కేసులున్నాయి.

కల్లు కాంపౌండ్ అడ్డా :
మహబూబ్‌నగర్‌లోని కల్లు కాంపౌండ్ శ్రీను అడ్డా. అక్కడికి వచ్చే ఒంటరి మహిళలతో మాటలు కలిపి వారిని తనతో తీసుకెళ్లడం.. ఆపై హత్య చేయడం అతనికి అలవాటుగా మారిపోయింది. నిజానికి జైలు నుంచి బయటకొచ్చాక శ్రీను మారిపోయినట్టు పోలీసులు కూడా నమ్మారు. అతనికి జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుపుతున్న పెట్రోల్ బంకులో ఉపాధి కూడా కల్పించారు. అక్కడ పనిచేస్తూనే శ్రీను ఇన్ని హత్యలు చేశాడని పోలీసులే షాక్ తిన్నారు.

పీడీ యాక్ట్ నమోదు :
సీరియల్ కిల్లర్ శ్రీనుపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు ఎస్పీ రాజేశ్వరి తెలిపారు. హంతకుడికి భార్య సాలమ్మ ఉందని, అతను చేసిన హత్యలకు ఆమె సహకారం కూడా ఉందని చెప్పారు. సాలమ్మను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. మహబూబ్‌నగర్‌లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్టు కనిపిస్తే.. వెంటనే 100కి సమాచారం ఇవ్వాలన్నారు.












Click it and Unblock the Notifications