బండి సంజయ్‌కు సిట్ నోటీసులు: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఆధారాలివ్వండి!
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీక్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు..బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీక్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు..బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేశారు. బండి సంజయ్ వద్ద ఉన్న ఆధారాలు సమర్పించాలని నోటీసుల్లో కోరారు. మార్చి 24న తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
బండి సంజయ్ ఇంట్లో అందుబాటులో లేరని సంజయ్ కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో వాచ్‌మెన్‌కు చెప్పి.. ఇంటి గోడకు నోటీసులు అంటించారు.బండి సంజయ్ చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు, ఇతర వివరాలు ఏవైనా ఉంటే దర్యాప్తు బృందానికి ఇవ్వాలని సిట్ అధికారులు స్పష్టం చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. టీస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ బాధ్యుడని బండి సంజయ్ ఆరోపించారు. గ్రూప్ 1 పేపర్ లీకేజీలో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయన్నారు. బీఆర్ఎస్ జడ్పీటీసీ, సర్పంచ్, సింగిల్ విండో ఛైర్మన్ పిల్లలు, బంధువులు గ్రూప్ 1 పరీక్షలో క్వాలిఫై అయ్యారని వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో ఒకే మండలం నుంచి50 మందికిపైగా.. క్వాలిఫై అయ్యారన్నారు. ఓ చిన్న గ్రామంలో ఆరుగురు క్వాలిఫై అయ్యారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ నియమించిన సిట్ దీనిపై విచారిస్తుందా? అని అడిగారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.

గ్రూప్-1 పరీక్షకు సంబంధించి ఒక్కొక్క విషయం వెలుగు చూస్తుంటే.. టీఎస్పీఎస్సీ స్కామ్ .. అనుకున్న దానికన్నా చాలా పెద్దదని అర్థమవుతోందన్నారు. బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు, వారివద్ద పని చేసే వాళ్లను గ్రూప్-1 ప్రిలిమ్స్ లో క్వాలిఫై చేసినట్టు తెలుస్తోందన్నారు.
మరోవైపు, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో ఒకే మండలం నుంచి 100 మందికి పైగా అభ్యర్థులు క్వాలిఫై అయ్యారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి ఆధారాలు ఏవైనా ఉంటే, సమర్పించాలంటూ సిట్ అధికారులు రేవంత్ రెడ్డిని కోరారు.












Click it and Unblock the Notifications