TSRTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం: సోనియా సంచలన ప్రకటన
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెడితే రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోతుంది. అసెంబ్లీ ఎన్నికలు 2024 వరకు వాయిదా పడే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు ఉన్నాయి.
వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లుపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టతా లేదు. దీన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన తరువాతే.. తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వాయిదా పడొచ్చా? లేక షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయా? అనేది తేలుతుంది. అప్పటివరకు తెలంగాణలో ఎవరి రాజకీయ కార్యకలాపాల్లో వారు మునిగిపోయారు.

యధాతథంగా షెడ్యూల్ ప్రకారమే ఈ అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సిన పరిస్థితే తలెత్తితే మాత్రం అక్టోబర్/నవంబర్‌లల్లో నోటిఫికేషన్ వెలువడుతుంది. డిసెంబర్‌లో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ముగిసిపోతుంది. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటవుతాయి. దీని కోసం అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటోన్నాయి.
ఈ పరిణామాల మధ్య అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కమిటీ తన రూటును మార్చింది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి కర్ణాటక తరహా ఫార్ములాను తెర మీదికి తీసుకొచ్చింది. కర్ణాటకలో పార్టీకి అధికారంలోకి తీసుకొచ్చిన పథకాలను ఇక్కడా ప్రకటించింది. మొత్తంగా ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల ముందు ఉంచింది కాంగ్రెస్.
ఇందులో అత్యంత కీలకమైనది- మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది. తుక్కుగూడలో ఏర్పాటైన బహిరంగ సభలో స్వయంగా సోనియా గాంధీ ఈ ప్రకటన చేశారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే టీఎస్ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని అన్నారు.
అలాగే- తెలంగాణలోని మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెలా 2,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని అన్నారు సోనియా గాంధీ. గృహలక్ష్మి పేరుతో ఈ పథకం కూడా కర్ణాటకలో అమల్లో ఉంది. అక్కడ ప్రతి నెలా 2,000 రూపాయలను చెల్లిస్తోంది సిద్ధరామయ్య సర్కార్. ఇక 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్లను ఇస్తామని సోనియాగాంధీ ప్రకటించారు.












Click it and Unblock the Notifications